YOGA : యోగా మతం కాదు.. అంతర్గత శ్రేయస్సు కోసం ఓ శాస్త్రం : సద్గురు
- Author : Prasad
Date : 21-06-2026 - 7:46 IST
Published By : Hashtagu Telugu Desk
యోగా అనేది ఎలాంటి మతం, తత్వశాస్త్రం లేదా సిద్ధాంతం కాదని, అది మన అంతర్గత శ్రేయస్సు కోసం రూపొందిన సంపూర్ణ శాస్త్రమని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “పన్నెండేళ్లు అంటే ఒక సౌర చక్రం. అంతర్జాతీయ యోగా దినోత్సవం కూడా ఒక పూర్తి చక్రాన్ని పూర్తి చేసుకుంది. ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి తనను తాను మెరుగుపరుచుకునే మార్గాలు ఉన్నాయని తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైంది” అని సద్గురు పేర్కొన్నారు.
యోగా అంటే కేవలం శరీరాన్ని మెలితిప్పే వ్యాయామం కాదని, మనసు, శరీరం, ఆత్మను సమతుల్యం చేసే శాస్త్రీయ విధానమని ఆయన వివరించారు. బాహ్య శ్రేయస్సుకు సైన్స్, టెక్నాలజీ ఎలా అవసరమో.. అంతర్గత శ్రేయస్సుకు యోగా కూడా అంతే అవసరమని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈశా ఫౌండేషన్ దేశవ్యాప్తంగా దాదాపు 1,000 ఉచిత యోగా, ధ్యాన కార్యక్రమాలను నిర్వహించింది. కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ విభాగాలు, రక్షణ సంస్థలు మరియు స్థానిక సంఘాల నుంచి సుమారు 50 వేల మందికి పైగా పాల్గొన్నారు.
కోయంబత్తూరులోని ఆదియోగి వద్ద సీఆర్పీఎఫ్ సిబ్బందికి ప్రత్యేక యోగా సెషన్ నిర్వహించగా, బెంగళూరులోని సద్గురు సన్నిధిలో ఎన్సీసీ కేడెట్లు, బీఎస్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో వేలాది మంది యోగా సాధన చేసి ఆరోగ్యకర జీవన విధానంపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా సద్గురు రూపొందించిన ఉచిత ధ్యాన యాప్ ‘మిరాకిల్ ఆఫ్ మైండ్’కు మరో ఆరు కొత్త భాషలను జోడించారు. దీంతో ఈ యాప్ ఇప్పుడు 12 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, జీవన నాణ్యత మెరుగుపడుతుందని సద్గురు పేర్కొన్నారు.