Police Commemoration Day : పోలీసు అమరులకు జై.. అలుపెరుగని యోధులకు సెల్యూట్
1959 సంవత్సరం అక్టోబర్ 21న (Police Commemoration Day) దారుణం జరిగింది.
- By Pasha Published Date - 11:29 AM, Mon - 21 October 24

Police Commemoration Day : ఇవాళ (అక్టోబరు 21) పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ రోజున మనం తప్పకుండా పోలీసు అమరులను గుర్తు చేసుకోవాలి. వాళ్లు మనందరి కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాలి. శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిత్యం పరిశ్రమించే మహా యోధులు పోలీసులు. వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజాయితీకి మారుపేరుగా నిలిచే పోలీసు సిబ్బంది కూడా నేటికీ ఎంతోమంది విధుల్లో ఉన్నారు. వారంతా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అలాంటి వారి వల్లే పోలీసు శాఖ గర్వంతో తల ఎత్తుకుంటోంది.
Also Read :Ration Cards : త్వరలోనే రేషన్ కార్డుల్లో కొత్త పేర్ల చేరిక
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అక్టోబరు 21వ తేదీనే ఎందుకు జరుపుకుంటున్నాం అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. ఈ తేదీనే ఎంపిక చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. 1959 సంవత్సరం అక్టోబర్ 21న (Police Commemoration Day) దారుణం జరిగింది. లడఖ్‌లోని లేహ్ ప్రాంతంలో బందోబస్తు విధుల్లో ఉన్న భారత జవాన్‌లపై చైనా సైనికులు అకస్మాత్తుగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది భారత జవాన్‌లు అమరులయ్యారు. వారి భౌతికకాయాలను అక్కడి నుంచి తీసుకొచ్చే వీలు లేకపోవడంతో అక్కడే ఖననం చేశారు. దీంతో ఆ జవాన్లను కడసారి చూసే అవకాశాన్ని కూడా సదరు కుటుంబాలు కోల్పోయాయి. ఆ ఘటనలో దేశం కోసం ప్రాణాలిచ్చిన 11 మంది భారత జవాన్ల ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం.
Also Read :Deepika Kumari : ఆర్చరీ వరల్డ్ కప్.. దీపికా కుమారికి రజతం
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు నుంచి అక్టోబరు 31 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని అన్ని జిల్లాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఓపెన్ హౌజ్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసుల విధులు, త్యాగాలు, సాంకేతిక వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఆన్‌లైన్‌లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నారు. పోలీసు కళాబృందాలతో ఈ నెల 31 వరకు ప్రధాన కూడళ్ల వద్ద కళాజాత చేపట్టనున్నారు.