No Confidence Motion Explained : మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం.. ఏం జరగబోతోంది ?
No Confidence Motion Explained : మణిపూర్ హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
- Author : Pasha
Date : 26-07-2023 - 3:06 IST
Published By : Hashtagu Telugu Desk
No Confidence Motion Explained : మణిపూర్ హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈక్రమంలోనే వీగిపోతుందని తెలిసినా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, బీఆర్ఎస్ పార్టీ వేర్వేరుగా అవిశ్వాస తీర్మానాల్ని లోక్ సభలో ప్రవేశ పెట్టాయి. ఇండియా కూటమి తరఫున అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ బుధవారం దాఖలు చేశారు. అయితే ఇండియా కూటమి దాఖలు చేసిన అవిశ్వాస తీర్మానానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అవిశ్వాస తీర్మానానికి ప్రవేశపెట్టడానికి కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం. ఈ మినిమం సపోర్ట్ ను ఇండియా కూటమి పొందగలిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి 50 మంది ఎంపీల మద్దతు లభించలేదు. దీంతో దాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు.
ఈశాన్య ప్రజల విశ్వాసాన్ని సర్కారు కోల్పోయిందనే సందేశాన్ని ఇచ్చేటందుకే..
ఈశాన్య ప్రాంతంలో కాంగ్రెస్‌కు అత్యంత కీలకమైన వ్యక్తుల్లో ఎంపీ గౌరవ్ గొగోయ్ ఒకరు. మణిపూర్ హింసాకాండతో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎన్డీఏ (నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్) కూటమిపై విశ్వాసాన్ని కోల్పోయారనే సందేశాన్ని ఇచ్చేటందుకే గౌరవ్ గొగోయ్ చేతులమీదుగా అవిశ్వాస తీర్మానాన్ని దాఖలు చేయించారని తెలుస్తోంది. దీనిపై ఓటింగ్ ఎప్పుడు నిర్వహించాలి అనేది లోక్ సభ స్పీకర్ నిర్ణయించనున్నారు.

Also read : Political Proffessor CBN : రాయలసీమద్రోహి జగన్ టైటిల్ తో చంద్రబాబు `PPT`
లోక్ సభలో ఎవరి బలం ఎంత ?
లోక్‌సభలో 543 మంది ఎన్నికైన ఎంపీలు, ఇద్దరు నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్లు ఉన్నారు. కాబట్టి ఒక రాజకీయ పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. కనీసం 272 మంది లోక్ సభ సభ్యుల బలాన్ని కలిగి ఉండాలి. ప్రస్తుతం లోక్‌సభలో సంఖ్యాబలం ఎన్డీఏ కూటమికే ఎక్కువగా ఉంది. ఈ కూటమికి సారధ్యం వహిస్తున్న బీజేపీకి 301 మంది ఎంపీలు ఉన్నారు. ఇక ఎన్డీఏ కూటమిలోని మిగితా పార్టీలకు మరో 22 మంది ఎంపీల బలం ఉంది. ఈ లెక్కన మొత్తం 332 మంది ఎంపీలు ఎన్డీఏ కూటమి గొడుగు కింద ఉన్నారు. కానీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో 141 మంది ఎంపీలే ఉన్నారు. ఈ కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ కు 49 మంది ఎంపీలు ఉన్నారు. ఇండియా కూటమిలో మిత్ర పక్షంగా ఉన్న తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీకి 24 మంది ఎంపీలు, బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 23 మంది ఎంపీలు, బీహార్ కు చెందిన జేడీయూ పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. ఈ లెక్కన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ లో ఎన్డీఏ కూటమి నెగ్గడం ఖాయం. అయినా మణిపూర్ హింసాకాండకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై తాము యుద్ధం చేస్తున్నామనే సందేశాన్ని జనంలోకి పంపేందుకే ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం అనే అస్త్రాన్ని సంధిస్తోంది.
Also read :Ram Likes Baby: యంగ్ బ్యూటీకి రామ్ అదిరిపొయే గిఫ్ట్, ఆనందంలో బేబీ హీరోయిన్!