Jatti Kalaga Wrestling : ప్రత్యర్ధి రక్తం చిందిస్తేనే గెలిచినట్టు.. ‘జట్టి కలగ’ పోటీల హిస్టరీ
Jatti Kalaga Wrestling : ప్రతీ ఏడాది దసరాలాగే.. ఈ దసరా వేళ కూడా జట్టి కలగ కుస్తీ పోటీలకు కర్ణాటకలోని మైసూరు నగరం రెడీ అయింది.
- Author : Pasha
Date : 14-10-2023 - 1:31 IST
Published By : Hashtagu Telugu Desk
Jatti Kalaga Wrestling : ప్రతీ ఏడాది దసరాలాగే.. ఈ దసరా వేళ కూడా జట్టి కలగ కుస్తీ పోటీలకు కర్ణాటకలోని మైసూరు నగరం రెడీ అయింది. ‘జట్టి కలగ’ పోటీలను ‘వజ్రముష్టి కలగ’ అని కూడా పిలుస్తారు. ఈ పోటీలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. మహాభారత కాలం నుంచే ఈ పోటీలు జరుగుతున్నాయని అంటారు. యదువంశ రాజులు యుద్ధాల్లో గెలుపొందిన తర్వాత నిర్వహించే విజయోత్సవాల్లో భాగంగా జట్టి కలగ కుస్తీ పోటీలను నిర్వహించేవారు. జట్టి కలగ పోటీల్లో పాల్గొనే రెజ్లర్లను జట్టీలు అని పిలుస్తారు. వీళ్ల మధ్య కుస్తీ మ్యాచ్ జరిగే ప్రదేశాన్ని ‘కన్నడి తొట్టి’ అని అంటారు. గతంలో జట్టీలను మైసూరు రాజులు పోషిస్తుండేవారు. కర్ణాటకలోని వడియార్ రాజవంశ పాలన ఉన్న టైంలో ఈ పోటీలు చాలా ప్రాచుర్యం పొందాయి. ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజున జట్టి కలగ పోటీలు మైసూరులో జరుగుతాయి.
We’re now on WhatsApp. Click to Join.
‘జట్టి కలగ’ పోటీలు చూడటానికి అచ్చం కుస్తీ పోటీలలాగే ఉంటాయి. ఇద్దరు చొప్పున ఈ పోటీలో తలపడతారు. అయితే ఈ పోటీల్లో ఒక పెద్ద షరతు ఉంటుంది. ప్రత్యర్ధికి రక్తం చిందేలా చేసి ఓడిస్తేనే గెలిచినట్టుగా ప్రకటించడం ఈ పోటీల ప్రత్యేకత. గుండు గీయించుకొని, వేళ్లలో ఇమిడిపోయే చిన్నపాటి ఇనుప ఆయుధాన్ని పట్టుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. ఎవరికి ముందుగా రక్తస్రావం అవుతుందో వాళ్లు ఓడినట్టుగా గుర్తిస్తారు. ఈ పోటీలను నిర్వహించడానికి ముందు జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. దసరా జంబూ సవారీ నిర్వహిస్తారు. ఇప్పటికీ మైసూరు రాజవంశం ఈ సంప్రదాయాలను పాటిస్తూనే ఉంది.
పోటీలో పాల్గొనే వారి ఎంపిక, ట్రైనింగ్..
నేటికీ చాలా జట్టి కుటుంబాలు కర్ణాటకలోని మైసూరు, చామరాజనగర్, చన్నపట్టణం, బెంగళూరు ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. ఒక్కో నగరం నుంచి ఇద్దరేసి చొప్పున జట్టీలను ఎంపిక చేసి ఈ పోటీలకు పంపుతారు. అందులో నుంచి ఇద్దరేసి చొప్పున ఉండే రెండు జట్లను ఎంపిక చేస్తారు. రెండు జట్టీల బృందాలను స్టాండ్‌బైలుగా ఉంచుతారు. మైసూరు రాజు, రాణి ముందు వారిని హాజరుపరుస్తారు. వారి అనుమతితో పోటీలు జరుగుతుంటాయి. ఒకసారి పోటీ పడిన జట్టీలు.. వచ్చే ఏడాది పోటీ పడేందుకు అనుమతి ఇవ్వరు. ఎంపికైన నాలుగు టీమ్ లకు 45 రోజులు ముందుగానే ప్రత్యేక శిక్షణ ప్రారంభమవుతుంది. వీరికి పూర్తిగా శాఖాహారాన్నే(Jatti Kalaga Wrestling) అందిస్తారు.