Train Owner : ఎక్స్‌ప్రెస్ రైలుకు ఓనర్ అయిన రైతు.. ఎలా అంటే ?
ఈ విచిత్ర ఘటనకు 2007 సంవత్సరంలో పంజాబ్‌లోని లుథియానాలో(Train Owner) బీజం పడింది.
- By Pasha Published Date - 05:14 PM, Tue - 12 November 24

Train Owner : మన దేశంలో రైళ్లు ప్రభుత్వ ఆస్తులు. అవి ఏ ఒక్క వ్యక్తి సొత్తు కాదు. అయితే అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఏకంగా ఓ ఎక్స్‌ప్రెస్ రైలుకు యజమానిగా మారిపోయాడు. కొన్నాళ్ల పాటు అతడు ఆ రైలుకు ఓనర్‌గా చలామణి అయ్యాడు. భారత రైల్వే చరిత్రలో ఇదొక పెద్ద తప్పిదంగా నిలిచిపోయింది. ఎందుకంటే.. రైల్వే అధికారులు చేసిన పొరపాటు వల్లే ఇదంతా జరిగింది. ఇంతకీ ఆ రైతు ఎవరు ? రైల్వే అధికారులు చేసిన పొరపాటు ఏమిటి ? ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Army Helpline : సైనికులు, మాజీ సైనికుల కోసం.. ఆర్మీ హెల్ప్ లైన్ 155306
ఈ విచిత్ర ఘటనకు 2007 సంవత్సరంలో పంజాబ్‌లోని లుథియానాలో(Train Owner) బీజం పడింది. ఆ ఏడాది లూథియానా- చండీగఢ్ రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే అధికారులు భూసేకరణ ప్రక్రియను నిర్వహించారు. లూథియానాలోని కటానా గ్రామంలో రైల్వే శాఖకు భూములిచ్చే రైతులకు ఎకరానికి రూ.25లక్షలు చొప్పున ఇవ్వాలని డిసైడ్ చేశారు. కటానా సమీపంలోని మరో గ్రామంలో ఎకరానికి రూ.71 లక్షలు చొప్పున రేటు కట్టి రైల్వే శాఖ భూములు తీసుకుంది. ఈవిషయం కటానా గ్రామ రైతు సంపూరణ్ సింగ్‌కు తెలిసింది. దీంతో అతడు తమ గ్రామ రైతులకు అన్యాయం జరిగిందంటూ కోర్టును ఆశ్రయించారు. తమకు కూడా ఎకరాకు రూ.71 లక్షలు చొప్పున పరిహారం అందేలా చూడాలని కోర్టును సంపూరణ్ సింగ్ కోరారు.
Also Read :BITS Pilani Hyderabad : గ్రహాలను చూపించే టెలిస్కోప్.. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో సందడి
ఈ న్యాయ పోరాటం నేపథ్యంలో రైల్వే శాఖ స్పందించి.. కటానా గ్రామ రైతులకు కూడా ఎకరానికి రూ.50లక్షల పరిహారాన్ని అందిస్తామని వెల్లడించింది. అయినా సంపూరణ్ సింగ్ వెనక్కి తగ్గలేదు. తాను రైల్వేశాఖకు అప్పగించిన 2 ఎకరాలకుగానూ రూ.71 లక్షలు చొప్పున మొత్తం రూ1.47 కోట్లను చెల్లించాలంటూ న్యాయపోరాటాన్ని కొనసాగించాడు. ఈ మొత్తాన్ని నార్తన్ రైల్వే 2015 సంవత్సరంలోగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయినా రైల్వే అధికారులు స్పందించలేదు. దీంతో సంపూరణ్ సింగ్ మరోసారి కోర్టు మెట్లు ఎక్కాడు. 2017 సంవత్సరం వరకు రైల్వే శాఖ తనకు రూ. 42లక్షలే ఇచ్చిందని.. మిగతా మొత్తాన్ని చెల్లించేలా చూడాలని కోర్టును కోరాడు. దీనిపై విచారణ జరిపిన డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి జస్పాల్ వర్మ సంచలన తీర్పును వెలువరించారు. ఢిల్లీ-అమృత్‌సర్ స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుతో పాటు లూథియానాలోని స్టేషన్ మాస్టర్ కార్యాలయాన్ని జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు సంపూరణ్ సింగ్ యజమాని అయ్యాడనే ప్రచారం జరిగింది. ఈ తీర్పుపై రైల్వే ఉన్నతాధికారులు ఎగువ కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆదేశాలు రద్దయ్యాయి.