Maharashtra Election Results : మహాయుతి గెలుపుకు ప్రధాన కారణాలు ఇవేనా..?
Maharashtra Election Results : స్మార్ట్ క్యాంపెయినింగ్, ఉచిత పథకాల ప్రాబల్యం, కుల రాజకీయ వ్యూహాలు, మరియు బలమైన పొత్తు వ్యవస్థ మహారాష్ట్రలో విజయాన్ని సాధించేందుకు కీలకంగా నిలిచాయి
- Author : Sudheer
Date : 23-11-2024 - 5:03 IST
Published By : Hashtagu Telugu Desk
మహారాష్ట్ర(Maharashtra )లో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి (Mahayuti) కూటమి భారీ విజయం సాధించింది. మహాయుతి ముందు ప్రతిపక్ష మహావిఘాస్ అఘాడీ (Maha Vikas Aghadi) తేలిపోయిందనే చెప్పాలి. ఎక్కడ కూడా కూటమి అభ్యర్థులకు పోటీ ఇవ్వలేకపోయారు. కేవలం నామమాత్రపు పోటీనే ఇచ్చింది. MNS, ప్రకాష్ అంబేద్కర్ వంచిత్ బహుజన్ అఘాడీ వంటి పార్టీలు ప్రభావం చూపడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఇప్పటికే మహాయుతిలో దాదాపు 200 మంది విజయం సాధించగా..మిగతా వరకు మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి భారీ మెజార్టీ సాధించింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 145 సీట్లను ఎప్పుడో అధిగమించిన మహాయుతి కూటమి.. 200 సీట్ల మార్ను సైతం క్రాస్ చేసింది. మహా వికాస్ అఘాడీ కూటమిని చిత్తు చేస్తూ.. ప్రస్తుతం 220 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అధిక్యంలో దూసుకుపోతుంది. ఈ అఖండ విజయానికి ప్రధాన కారణాలు (Major reasons for Mahayuti’s victory) ఇవే అని అంత మాట్లాడుకుంటున్నారు.
1 . ఉచిత పథకాల ప్రభావం : ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యమంత్రి మారీ లడ్కీ బహిన్ యోజన స్కీమ్.. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం నెలకు రూ. 1500 అందించడం, భవిష్యత్తులో దీనిని రూ. 2100కి పెంచుతామని ప్రకటించడం. ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇది గ్రామీణ మరియు మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమైన ఆర్థిక ఉపశమన పథకంగా మారింది. యువత కోసం ప్రత్యేక పథకాలు: నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యాల శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో యువత నుంచి మద్దతు లభించింది.
2 . కుల రాజకీయం మరియు సామాజిక సమీకరణాలు : మహారాష్ట్రలో కుల సమీకరణాలు చారిత్రాత్మకంగా రాజకీయాలకు కీలకంగా మారాయి.
మరాఠా రిజర్వేషన్ల వ్యవహారం: గత లోక్‌సభ ఎన్నికల్లో ఓబీసీ వర్గాలు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ఈసారి, బీజేపీ మరాఠా, ఓబీసీ వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది.
శివసేన-ఎన్సీపీ విభజన: మహా వికాస్ అఘాడీ కూటమి విడిపోయిన తర్వాత, ఈ రాజకీయ సంక్షోభం మహాయుతి కూటమికి లాభంగా మారింది.
హిందూ ఏకతత్వం: ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ “హిందూ ఏకత్వం”నినాదాలు హిందువుల ఓటు బ్యాంక్ కు బాగా కలిసొచ్చాయి.
3. మహాయుతి కూటమి నినాదాలు :
“ఏక్ హై తో సేఫ్ హై”: ప్రధాని మోదీ నినాదం ప్రజల్లో భద్రత, సుస్థిరత అన్న భావనను ప్రేరేపించింది.
“బాటింగే టు కటేంగే”: యోగి ఆదిత్యనాథ్ నినాదం కుల రహిత సమాజం కోసం మహాయుతి ప్రయత్నాలను హైలైట్ చేసింది. మహారాష్ట్ర ప్రజల నాడిని గుర్తించి, ఈ నినాదాల ద్వారా బీజేపీ ప్రచారం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
4. విదర్భలో మహాయుతి ప్రత్యేక దృష్టి :
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం ప్రతిసారీ నిర్ణయాత్మక పాత్ర పోషించింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పరాజయం చెందిన ఈ ప్రాంతంపై మహాయుతి ప్రత్యేక దృష్టి పెట్టింది. వ్యూహకర్త కైలాష్ విజయవర్గియ నేతృత్వంలో, బీజేపీ కార్యకర్తలు రెండు నెలల పాటు విదర్భలో మకాం వేయడం ఆర్ఎస్ఎస్ మద్దతుతో బీజేపీ మరింత బలపడింది. దీనివల్ల విదర్భలో భారీ సంఖ్యలో స్థానాలు గెలుచుకుని మహాయుతి విజయానికి దారితీసింది.
5. పట్టు ఉన్న ప్రచార యంత్రాంగం :
మహాయుతి ప్రచార వ్యూహం కట్టుదిట్టంగా మరియు ముందస్తు ప్రణాళికలతో అమలు చేయడం కూడా విజయానికి కలిసొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ 106 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 ర్యాలీల ద్వారా మహాయుతి ప్రచారానికి బలాన్నిచ్చారు. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ఇతర ముఖ్య నాయకులు గ్రౌండ్ లెవల్ లో ప్రచారం చేయడం కూడా విజయానికి కారణంగా మారింది.
వోటర్లను వ్యక్తిగతంగా కలిసిన నేతలు: ఎన్నికల ముందు వోటర్లను కలవడం, పోలింగ్ రోజు మధ్యాహ్నం వరకు వోటు వేయనివారిని ఓటింగ్ చేయించడంలో కృషి చేయడం బీజేపీ బలమైన ప్రచార పద్ధతిగా మారింది.
6. మహా వికాస్ అఘాడీ బలహీనత
శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ, శివసేన విభజన వల్ల మహా వికాస్ అఘాడీ కూటమి బలహీనమైంది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పట్టు తగ్గడమే కాకుండా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి నేతలు పరిమితంగా ప్రచారంలో పాల్గొనడం ప్రతిపక్షాలను మరింత బలహీనులను చేసింది. ఇలా ఈ కారణాలని కూడా ఈరోజు మహాయుతి కూటమి విజయానికి కారణాలుగా మారాయి. స్మార్ట్ క్యాంపెయినింగ్, ఉచిత పథకాల ప్రాబల్యం, కుల రాజకీయ వ్యూహాలు, మరియు బలమైన పొత్తు వ్యవస్థ మహారాష్ట్రలో విజయాన్ని సాధించేందుకు కీలకంగా నిలిచాయి.
Read Also : Mahayuti Sweep In Maharashtra : ‘మహాయుతి’కి ఏపీ సీఎం చంద్రబాబు విషెస్