Jet Pack Suits: త్వరలో భారత సైనికులకు జెట్ ప్యాక్ సూట్స్
భారత సైనికులు ఇకపై సూపర్ మ్యాన్స్ లా మనకు గాల్లో ఎగురుతూ కనిపించనున్నారు.
- By Hashtag U Published Date - 04:08 PM, Mon - 30 January 23

భారత సైనికులు ఇకపై సూపర్ మ్యాన్స్ లా మనకు గాల్లో ఎగురుతూ కనిపించనున్నారు. ఇలా గాల్లో ఎగిరేందుకు ఉపయోగపడే జెట్ ప్యాక్ సూట్ ను కొనాలని ఇండియన్ ఆర్మీ యోచిస్తోంది. ఈ ఒక్కో సూట్ ధర రూ.4 కోట్ల దాకా ఉంటుందట. ఫాస్ట్ ట్రాక్ ప్రోక్యుర్మెంట్ కింద ఇలాంటి 48 జెట్ ప్యాక్ సూట్ లను కొనే ఛాన్స్ ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.భారత సైన్యం దీనిని స్వదేశీ కంపెనీ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటోందట.
జెట్ ప్యాక్ సూట్ ఇలా పని చేస్తుంది
జెట్ ప్యాక్ సూట్ లో ఐదు గ్యాస్ టర్బైన్ జెట్ ఇంజన్లు ఉంటాయి. ఇవి సుమారు 1000 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ సూట్ జెట్ ఇంధనం, డీజిల్ లేదా కిరోసిన్‌తో నడుస్తుంది. దీన్ని ధరించి సైనికులు 10 నుంచి 15 మీటర్ల ఎత్తు ఎగరవచ్చు. సూట్ గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది. జెట్ ప్యాక్ బరువు 40 కిలోల కంటే తక్కువే ఉంటుందని అంటున్నారు. 80 కిలోల బరువున్న సైనికుడు దీన్ని ధరించి 8 నిమిషాల పాటు గాల్లో ఎగరగలడు. ఈ సూట్ ఏ సీజన్‌లోనైనా పని చేస్తుంది.
సరిహద్దుల్లో పహారా, పర్వతాలు, అడవుల్లో నిఘా వంటి వాటికి ఇవి ఎంతో యూజ్ ఫుల్ గా ఉంటాయి. జెట్ ప్యాక్ సూట్ ను రెండు చేతుల బలంతో కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. తన చేతుల కదలికతో జెట్‌ప్యాక్ దిశను మార్చుకోవచ్చు. కాబట్టి ఇది ధరించి ఎగిరేటప్పుడు శత్రు మూకపై దాడి చేసే ఛాన్స్ ఉండదు. అయితే భవిష్యత్ లో ఇందులో మార్పులు చేసి.. దాడి చేసేందుకు అనువైన సెట్టింగ్స్ చేసే అవకాశం ఉంది. అమెరికా సైన్యం కూడా ఈ జెట్‌ప్యాక్‌ను ఉపయోగిస్తోంది.