Hyderabadi Haleem: హైదరాబాద్ హలీం వరల్డ్ ఫేమస్.. విశిష్ట వంటకాన్ని జీఐ ట్యాగ్!
రంజాన్ మాసంలో ముస్లింలు శక్తి కోసం తీసుకునే ప్రత్యేక ఆహారం హలీం. చికెన్, మటన్ వేరియంట్లలో లభ్యమయ్యే హలీం..
- By Balu J Published Date - 01:12 PM, Wed - 19 October 22

రంజాన్ మాసంలో ముస్లింలు శక్తి కోసం తీసుకునే ప్రత్యేక ఆహారం హలీం. చికెన్, మటన్ వేరియంట్లలో లభ్యమయ్యే హలీం.. నెయ్యి, మసాలా దినుసుల ఘుమఘుమలతో నోరూరిస్తుంది. ఇక హైదరాబాద్ హలీం అంటే వరల్డ్ ఫేమస్ అని చెప్పాలి. ఇక్కడి నుంచి అరబ్ దేశాలకు కూడా హలీం ఎగుమతి అవుతుందంటే దీని రుచి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అందుకే ఈ హలీంను విశిష్ట వంటకంగా గుర్తిస్తూ కేంద్రం 2010లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్ ను అందించింది.
ఇక అసలు విషయానికొస్తే…. ఇటీవల కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ భారతీయులు, విదేశాల్లో ఉన్నవారితో సర్వే నిర్వహించింది. జీఐ ట్యాగ్ పొందిన దేశీయ వంటకాల్లో రారాజు ఏదని ఆ సర్వేలో అడగ్గా, అత్యధికులు హైదరాబాద్ హలీంకే ఓటేశారు. రసగుల్లా, బికనేరీ భుజియా, రాట్లమీ సేవ్ వంటి 17 జీఐ వంటకాలను వెనక్కినెట్టి హలీం ‘మోస్ట్ పాప్యులర్ జీఐ’గా నిలిచింది.
ఆగస్టు 2 నుంచి అక్టోబరు 9 మధ్యన ఈ సర్వే నిర్వహించారు. ఇటీవలే ఈ అవార్డును పిస్తా హౌస్ డైరెక్టర్, హైదరాబాద్ హలీం తయారీదారుల సంఘం అధ్యక్షుడు ఎంఏ మాజిద్ కు కేంద్రమంత్రి పియూష్ గోయల్ బహూకరించారు. కాగా, హైదరాబాద్ హలీంకు ఈ పురస్కారం దక్కడం ఇదే ప్రథమం కాదు. గతంలోనూ ఓ పర్యాయం ‘మోస్ట్ పాప్యులర్ జీఐ’గా నిలిచింది