Bobbili Yuddham : బొబ్బిలి యుద్ధానికి 268 ఏళ్లు..!
Bobbili Yuddham : 1757 జనవరి 24న జరిగిన ఈ యుద్ధం తెలుగు చరిత్రలో పౌరుషానికి, వీరత్వానికి చిహ్నంగా నిలిచింది
- By Sudheer Published Date - 03:49 PM, Fri - 24 January 25

Bobbili Yuddham 1757 : బొబ్బిలి యుద్ధానికి ఈరోజుతో 268 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 1757 జనవరి 24న జరిగిన ఈ యుద్ధం తెలుగు చరిత్రలో పౌరుషానికి, వీరత్వానికి చిహ్నంగా నిలిచింది. బొబ్బిలి రాజులు, విజయనగరం రాజులు, ఫ్రెంచ్ ఉమ్మడి సేనల మధ్య జరిగిన ఈ యుద్ధం ఎన్నో జీవితాలను హరిస్తూ, ఒక దారుణమైన కథగా మిగిలిపోయింది. ఈ యుద్ధంలో వేలాదిమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బొబ్బిలి కోటపై దాడులు చేయడానికి విజయనగరం రాజులు ఫ్రెంచ్ సైన్యంతో కలిసి వచ్చారు. సైనిక బలంలో ఆధిక్యం ఉన్నప్పటికీ, బొబ్బిలి రాజుల వీరోచిత పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.
Sharadha peetham : విశాఖ శారదా పీఠానికి హైకోర్టు కీలక ఆదేశాలు..!
యుద్ధం తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ప్రాణాలను కాపాడుకోలేమని భావించిన మహిళలు, చిన్నారులు ఆత్మార్పణ చేసుకున్నారు. బొబ్బిలి రాజులు పోరాట స్ఫూర్తితో చివరిదాకా నిలబడ్డారు. విజయనగరం రాజు విజయరామరాజును, తాండ్రపాపారాయుడు తన ధైర్య సాహసాలతో వాదించారు. చివరికి తాండ్రపాపారాయుడు కూడా వీరమరణం పొందారు. ఈ సంఘటన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. బొబ్బిలి యుద్ధం తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ యుద్ధం స్మారకంగా ప్రతి సంవత్సరం బొబ్బిలిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, వీరులను స్మరించుకుంటున్నారు.
బొబ్బిలి యుద్దం జరిగిన చోట, బొబ్బిలి కోట నెలమట్టమైన చోట స్మారక స్థూపం కూడా ఏర్పాటు చేశారు. నాటి బొబ్బిలి యుద్ధాన్ని స్మరించుకుంటూ ఏటా జనవరి 24న కోటలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా బొబ్బిలి యుద్ధస్తూపం వద్ద యుద్ధ వీరులకు ఘనంగా నివాళులర్పిస్తారు బొబ్బిలి రాజ వంశీయులు. నాడు యుద్ధంలో వాడిన కత్తులు, బల్లేలు, కవచాలు, తుపాకుల్లాంటివన్నింటినీ కోటలో సందర్శనకు ఏర్పాటు చేశారు. సింహాసనం సహా అనేక వస్తువులతో కలిపి మ్యూజియంగా ఉంచి వారసత్వ సంపదను సంరక్షిస్తున్నారు.