Vijay Thalapathy: సూర్యుడికి, వరుణుడికి కులం, మతం ఉందా?
రాజకీయాల్లో కులం, మతాలను ప్రాధాన్యత ఇవ్వకండని విద్యార్థులు మరియు వారి కుటుంబ సభ్యులకు టీవీకే నేత విజయ్ స్పష్టం చేశారు.
- By Kode Mohan Sai Published Date - 04:07 PM, Fri - 30 May 25

Vijay Thalapathy: తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ విద్యార్థులకు ముఖ్యమైన సందేశం ఇచ్చారు. కుల, మత అంశాలతో మనసును పాడుచేసుకోవద్దని, అలాంటి విభజనలను త్రోసిపుచ్చాలని ఆయన కోరారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన కార్యక్రమంలో, 10వ తరగతి, 12వ తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను విజయ్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు మార్గదర్శకాలు ఇచ్చారు.
విజయ్ మాట్లాడుతూ
“ఈ ప్రకృతికి మతం ఉందా? కులం ఉందా? సూర్యుడు, వాన, వాయువు అందరికీ సమానంగా ఉంటే మనం ఎందుకు భిన్నంగా ఉండాలి? ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఇచ్చే వ్యవస్థ. ప్రజాస్వామిక విలువలను అర్థం చేసుకొని, అవినీతికి దూరంగా ఉండే విశ్వసనీయ వ్యక్తులకు ఓటు వేయండి” అని విజ్ఞప్తి చేశారు.
“డ్రగ్స్‌ను దూరంగా ఉంచినట్టు, కులం–మతం వంటి విషాలను కూడా మన జీవితాల నుంచి బయట పెట్టాలి” అని అన్నారు. ‘‘ప్రజాస్వామ్యం ఉన్న చోటే నిజమైన స్వేచ్ఛ ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. విజయ్ రాజకీయ వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో సూటిగా, వ్యవస్థలపై ప్రశ్నలతో కూడినవిగా ఉండటం తెలిసిందే.
తమిళనాడు ఎన్నికల వేడి ప్రారంభమవుతోంది
ఇదిలా ఉండగా, తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో చురుకుదనం పెరిగింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఇప్పటికే సిద్ధమవుతోంది, ముఖ్యంగా అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. భాజపాపైనా ఆయన వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు.