Kerala Result : కేరళంలో సంబరాలకు UDF, బీజేపీ ఏర్పాట్లు ..మరి ఏంజరుగుతుందో ?
సంబరాలు ఒకవైపు కొనసాగుతున్నా, అధికార ఎల్డీఎఫ్ కూటమి మాత్రం సైలెంట్‌గా తన వ్యూహాలను అమలు చేస్తోంది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని చరిత్ర సృష్టించాలని పినరయి విజయన్ సర్కార్ ఆశిస్తోంది
- Author : Sudheer
Date : 03-05-2026 - 4:50 IST
Published By : Hashtagu Telugu Desk
రేపు (మే 4, 2026) కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో అధికారం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొన్న వేళ, గెలుపుపై ధీమాతో ఉన్న ప్రధాన పార్టీలు ఇప్పటికే విజయ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. ముఖ్యంగా యూడీఎఫ్ (UDF) మరియు బీజేపీ (BJP) శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
మలప్పురంలో బిర్యానీ విందు.. యూడీఎఫ్ ధీమా!
కేరళలో ఈసారి మార్పు ఖాయమని భావిస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి సంబరాలకు సిద్ధమైంది. మలప్పురం జిల్లాలోని పాండిక్కడ్‌లో యూడీఎఫ్ కార్యకర్తలు గెలుపు ఉత్సాహాన్ని చాటుకునేందుకు ఏకంగా 5 వేల మందికి పైగా కార్యకర్తల కోసం నోరూరించే బిర్యానీని సిద్ధం చేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా ఎల్డీఎఫ్ (LDF), యూడీఎఫ్ మధ్యే పోరు సాగే కేరళలో, ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని యూడీఎఫ్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకునే కార్యకర్తలకు మరియు విజయోత్సవాల్లో పాల్గొనే వారికి ఎలాంటి లోటు లేకుండా ఈ భారీ విందును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
కొచ్చిలో లడ్డూల పంపిణీ.. బీజేపీ భారీ ఆశలు!
మరోవైపు కేరళ రాజకీయాల్లో పాగా వేయాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా పక్కా ప్రణాళికలతో ఉంది. కొచ్చిలో విజయ వేడుకల కోసం ఇప్పటికే వందలాది కిలోల లడ్డూలను నేతలు ఆర్డర్ ఇచ్చారు. గతంతో పోలిస్తే ఈసారి కేరళలో తమ బలం గణనీయంగా పెరిగిందని, కచ్చితంగా ఖాతా తెరుస్తామని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా నేమం, కాజకూటం, మంజేశ్వర్, పాలక్కడ్, తిరువల్ల వంటి నియోజకవర్గాల్లో కమలం వికసిస్తుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. ఈ స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చామని, ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే దక్షిణ భారతంలో మరో కీలక రాష్ట్రంలో పట్టు సాధించినట్లవుతుందని బీజేపీ భావిస్తోంది.
రేపు తేలనున్న కేరళ జాతకం
సంబరాలు ఒకవైపు కొనసాగుతున్నా, అధికార ఎల్డీఎఫ్ కూటమి మాత్రం సైలెంట్‌గా తన వ్యూహాలను అమలు చేస్తోంది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని చరిత్ర సృష్టించాలని పినరయి విజయన్ సర్కార్ ఆశిస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ భిన్నమైన అంచనాలను వెలువరించడంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా, మధ్యాహ్నం 12 గంటల కల్లా కేరళ ఓటరు నాడి ఎటో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మలప్పురం బిర్యానీ విందులు, కొచ్చి లడ్డూల పంపిణీ ఫలితాల తర్వాత కూడా కొనసాగుతాయా లేక సమీకరణాలు మారుతాయా అనేది వేచి చూడాలి.