New Traffic Rules : ఆ గుర్తు లేని హెల్మెట్ పెట్టుకుంటున్నారా..? అయితే ఫైన్ పడినట్లే..!
బెంగుళూరు లో ట్రాఫిక్ పోలీసులు మరోసారి ఐఎస్ఐ గుర్తు లేని హెల్మెల్‌లపై నిషేధాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు.
- By Hashtag U Published Date - 04:15 PM, Tue - 25 January 22

బెంగుళూరు లో ట్రాఫిక్ పోలీసులు మరోసారి ఐఎస్ఐ గుర్తు లేని హెల్మెల్‌లపై నిషేధాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఐఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్ వాడకం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం తప్పుతుందని పోలీసులు అంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు నెల రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాత రైడర్లకు జరిమానా విధించడం ప్రారంభిస్తారు. నాణ్యత లేని హెల్మెట్ ధరించే వాహనదారుడిని హెల్మెట్ లేని వారిగానే పరిగణించి, రూ. 500 జరిమానా విధించబడుతుందని జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), B. R. రవికాంతే గౌడ తెలిపారు. వాహనదారుడి లైసెన్స్ నిర్భంధించి.. సస్పెన్షన్ కోసం ఆర్టీవోకి పంపిస్తామని తెలిపారు. కేవలం 44% మంది వాహనదారులు ISI గుర్తు ఉన్న హెల్మెట్‌లను ఉపయోగిస్తున్నారని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్) అధ్యయనం వెల్లడించింది.
మిగిలిన వారు నాసిరకం హెల్మెట్‌లను ఉపయోగిస్తున్నారని పేర్కొంది.ద్విచక్రవాహనాల కోసం వేలకు వేలు ఖర్చుపెడుతున్నా హెల్మెట్ విషయంలో మాత్రం అలసత్వం వహిస్తున్నారని చిక్‌పేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ అనిల్‌కుమార్ గ్రామపురోహిత్ అన్నారు. పోలీసు అధికారులు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా చూడాలని డిమాండ్ చేస్తూ అన్ని డీసీపీలకు లేఖ పంపాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. పోలీసు అధికారులు ధరించే హాఫ్ హెల్మెట్‌ల స్థానంలో ఐఎస్‌ఐ గుర్తు ఉన్న హెల్మెట్‌లను తప్పనిసరిగా పెట్టాలని పోలీసులు తెలిపారు.