Kerala Lockdown: కేరళలో ఆ రెండు రోజులు లాక్ డౌన్..!
కేరళలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే రెండు ఆదివారాల్లో లాక్‌డౌన్ లాంటి ఆంక్షలను విధించాలని కేరళ సర్కార్ నిర్ణయించింది. లాక్ డౌన్ లో అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
- By Hashtag U Published Date - 10:23 PM, Thu - 20 January 22

కేరళలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే రెండు ఆదివారాల్లో లాక్‌డౌన్ లాంటి ఆంక్షలను విధించాలని కేరళ సర్కార్ నిర్ణయించింది. లాక్ డౌన్ లో అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. యాక్టివ్ కేసులు 2 లక్షలకు చేరుకోవడంతో పాటు 42.7 శాతం పాజిటివిటీతో ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
థర్డ్ వేవ్‌లో బెడ్ ఆక్యుపెన్సీ లేదా ఆసుపత్రిలో చేరడం సెకండ్ వేవ్ తో పోల్చితే గణనీయంగా తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. డిజి-ఐసిఎంఆర్ డాక్టర్ బలరామ్ భార్గవ దేశంలో కోవిడ్ -19 పరిస్థితిపై మీడియాకు వివరిస్తూ టీకాల కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. థర్డ్ వేవ్ లో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మరణాలను ఎక్కడా నమోదు కాలేదని ఆయన తెలిపారు.
కోవిడ్ పరీక్షల సంఖ్య గురువారం పెరగడంతో కేరళలో రాష్ట్రంలో 46,387 తాజా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 1,15,357 పరీక్షలు జరిగాయి. తిరువనంతపురంలో అత్యధికంగా 9,720 కేసులు నమోదవ్వగా.. తరువాత స్థానంలో ఎర్నాకులం ఉంది. కోజికోడ్ లో 3,002 , త్రిసూర్ లో 4,016, కొట్టాయంలో 3,627, కొల్లంలో 3,091 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,99,041 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో కేవలం 3 శాతం మంది మాత్రమే ఆసుపత్రి పాలయ్యారు. పాజిటివ్ పరీక్షించిన వారిలో 172 మంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చారు.
గత వారంతో పోలిస్తే, కోవిడ్ కేసుల సంఖ్య 204 శాతం పెరిగింది. పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు ప్రకటించింది. వచ్చే రెండు ఆదివారాలు (జనవరి 23, 30) పూర్తి లాక్‌డౌన్‌ను విధించింది. ఆదివారం, మాల్స్, థియేటర్లు పూర్తిగా మూతపడనున్నాయి. విద్యార్థులందరికి ఆన్‌లైన్‌లో క్లాసులు జరగనున్నాయి. 10, 12వ తరగతి విద్యార్థులకు కూడా ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి జిల్లా యంత్రాంగం కేసుల సంఖ్య ఆధారంగా కొత్త ఆంక్షలపై నిర్ణయం తీసుకోవచ్చని.. థియేటర్లు, బార్లపై పరిమితులను సంబంధిత జిల్లా కలెక్టర్లు నిర్ణయించవచ్చని ప్రభుత్వం తెలిపింది. తిరువనంతపురం, వాయనాడ్, పాలక్కాడ్, ఇడుక్కి, పతనంతిట్ట జిల్లాల్లో బహిరంగ సభలపై నిషేధంతోపాటు భారీ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఎర్నాకుళం, అలప్పుజ మరియు కొల్లంలో బహిరంగ సభలు 50 మందితో మాత్రమే నిర్వహించబడతాయి.