Karnataka polls: కన్నడ పాలిటిక్స్… అర్బన్ ఓటర్లు ఈ సారి ఎటువైపు..?
కర్ణాటకలో ఏపార్టీ అధికారం చేపట్టాలన్నా.. బెంగళూరు అర్బన్ చాలా కీలకం. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాల్లో నాలుగో వంతు ఈ జిల్లాలోనే ఉన్నాయి.
- Author : Naresh Kumar
Date : 28-04-2023 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
Karnataka Polls: కర్ణాటకలో ఏపార్టీ అధికారం చేపట్టాలన్నా.. బెంగళూరు అర్బన్ చాలా కీలకం. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాల్లో నాలుగో వంతు ఈ జిల్లాలోనే ఉన్నాయి. 2008 ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకోగా.. 2013, 2018ల్లో మాత్రం కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించింది. మరి ఈసారి అర్బన్ ఓటర్లు ఎవరికి జైకొట్టనున్నారు..?
కర్ణాటక రాజధాని బెంగళూరు. క్యాపిటల్ సిటీ పరిధిలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 224 అసెంబ్లీ సీట్లు ఉన్న కర్ణాటకలో 20శాతం ఓటర్లు ఈ బెంగళూరు అర్బన్ జిల్లాలోనే ఉన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టాలంటే.. రాజకీయ పార్టీలు అర్బన్ ఓటరును ఆకట్టుకోవాల్సిందే.
బెంగళూరు నగరం .. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సిలికాన్ సిటీ. కానీ స్థానికంగా అనేక సమస్యలు నగరవాసుల్ని వేధిస్తున్నాయి.
జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేకపోవడం, అధ్వానమైన రోడ్లు, చినుకుపడితే చెరువులా మారే రహదారులు, వ్యర్థాల నిర్వహణలో లోపాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, అన్నింటికీ మించి అవినీతి ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలుగా ఉన్నాయి.
2022 మార్చి నుంచి మే వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు బెంగళూరులోని 40శాతం ప్రాంతాలు ముంపునకు గురైయ్యాయి. మహదేవపుర, బెళ్లందూరు, కోరమంగళ, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్‌రోడ్డు ప్రాంతాల్లోని ఐటీ ఆఫీసులు చెరువుల్లా మారిపోవడం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. చిన్నపాటి వర్షాలకే బెంగళూరు రోడ్లు గుంతలమయంగా మారడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రధాని మోదీ ఓపెన్ చేసిన బెంగళూరు-మైసూరు హైవే వారానికే నీటమునగడంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. బెంగళూరు అర్బన్ జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత.. 2008లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 18, కాంగ్రెస్ 10 స్థానాలు గెలుపొందాయి. ఆ తర్వాత జరిగిన 2013, 2018 ఎన్నికల్లో హస్తం పైచేయి సాధిస్తూ వచ్చింది. గతఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లు వచ్చినా.. తర్వాత జరిగిన రాజకీయ మార్పులతో కమలదళం బలం పెరిగింది. ఈసారీ కూడా బెంగళూరు అర్బన్‌లో కాంగ్రెస్, కమలనాథుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. శాంతినగర, బెంగళూరు సెంట్రల్, సి.వి.రామన్ నగర, పులకేశినగరలో తమిళ ఓటర్ల ప్రభావం ఉండగా మహదేవపుర, బీటీఎం లేఔట్, యెలహంక, హెబ్బాళ, యశ్వంతపుర, కేఆర్‌పురలో తెలుగు ఓటర్లు, శివాజీనగర, చామరాజపేటలో ముస్లింలు, చిక్కపేటలో హిందీ ఓటర్లు గెలుపోటములు నిర్ణయిస్తారు. మరి ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి.. బెంగళూరు అర్బన్‌లో బీజేపీ సత్తా చాటుతుందా..? లేక వరుసగా మూడోసారి హస్తవాసి కొనసాగుతుందా అన్నది మే 13న తేలనుంది.