CBI Cases Vs DKS : డీకే శివకుమార్‌కు సిద్ధరామయ్య గుడ్ న్యూస్
CBI Cases Vs DKS : ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఊరట కలిగించే విషయమిది.
- By Pasha Published Date - 11:57 AM, Fri - 24 November 23

CBI Cases Vs DKS : ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఊరట కలిగించే విషయమిది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనపై సీబీఐ దర్యాప్తును ఉపసంహరించుకునే ప్రతిపాదనకు కర్ణాటక ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో విధానసౌధలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈనిర్ణయం తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసును సీబీఐకి అప్పగించాలని గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఖండించింది. బీజేపీ సర్కారు గతంలో తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమైందని పేర్కొంది. గత బీజేపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌తో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఇచ్చిన అభిప్రాయాలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నామని కర్ణాటక కేబినెట్ వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఇప్పటివరకు కర్ణాటకలో 577 కేసులు నమోదవగా, ఒక్క కేసును కూడా సీబీఐ దర్యాప్తు చేయలేదు. వాటిని స్థానిక పోలీసులే విచారణ చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కేసును కూడా రాష్ట్రానికే పరిమితం చేయాలని, సీబీఐ జోక్యం అక్కర లేదని కర్ణాటక సర్కారు డిసైడ్ చేసింది. వాస్తవానికి ఈ కేసులో సీబీఐ విచారణ ఐదేళ్ల క్రితమే మొదలైంది. 2018 సంవత్సరంలో డీకే శివకుమార్‌పై సీబీఐ తొలిసారిగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఈ కేసును 2019లో కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించేందుకు(CBI Cases Vs DKS) అంగీకరించారు. సీబీఐ చేపట్టిన డీకే శివకుమార్ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ కోర్టు ఎదుట పెండింగ్‌లో ఉంది. ఈ దశలో దాన్ని సీబీఐ పరిధి నుంచి తప్పించడం సాధ్యపడకపోవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు.