Jagan Master Sketch on Amaravati: జగన్ మాస్టర్ స్కెచ్, అమరావతి రైతులు ఔట్!
అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి వేసిన చక్రబంధంలో ఇరుక్కోబోతున్నారు
- By Hashtag U Published Date - 04:33 PM, Tue - 1 November 22

అమరావతి రైతులు జగన్ మోహన్ రెడ్డి వేసిన చక్రబంధంలో ఇరుక్కోబోతున్నారు. విడవమంటే పాముకు కరవమంటే కప్పుకు కోపం చందంగా పద్మవ్యూహాన్ని జగన్ మోహన్ రెడ్డి సర్కార్ రచించింది. అమరావతి మాస్టర్ ప్లాన్ పరిధిలో 900 ఎకరాలను పేదలకు ఇవ్వడానికి కేటాయిస్తూ సీఆర్డీయే అనుమతిచ్చేలా స్కెచ్ వేసింది. ఇప్పటికే సీఆర్డీయే చట్టాన్ని సవరించిన జగన్ సర్కార్ పేదలకు భూములు ఇవ్వడానికి సిద్దం అవుతోంది.
కోర్ కాపిటల్ ఏరియాలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి అభ్యంతరాలను తెలియచేయాలని సీఆర్డీయే కోరింది. దానిపై రైతులు ఏ విధంగా స్పందించాలి? అనే డైలమాలో పడిపోయారు. ఒక వేళ కోర్ ఏరియాలో పేదలకు ఇళ్ల స్థలాలు వద్దంటే ఇతర ప్రాంతాల వాళ్లను అడ్డుకుంటున్నారనే ప్రచారాన్ని బలంగా వైసీపీ తీసుకెళుతోంది. అనుమతిస్తే కోర్ కాపిటల్ ఏరియాలో సమతుల్యత దెబ్బతింటుందని రైతులు భావిస్తున్నారు.
Also Read: Chandrababu Naidu: సింహానికి రాజకీయ బోను
అమరావతి కోర్ కాపిటల్ పరిధిలో 900 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక జోన్ ను జగన్ సర్కార్ క్రియేట్ చేసింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ను సీఆర్డీయే ద్వారా విడుదల చేస్తూ స్థానికుల నుంచి అభ్యంతరాలను కోరింది. దీంతో రైతులు తికమక పడుతున్నారు. కత్తికి రెండు వైపులా పదునుండేలా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ ఇప్పుడు అమరావతి రైతులను వేధిస్తోంది.