Amit Shah: కర్ణాటకలో అమిత్ షా పర్యటన .. నాయకత్వ మార్పు ఖాయమా..?
కర్ణాటకలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో కర్ణాటక బీజేపీలో నాయకత్వ మార్పు ఉంటుందని అందరు భావిస్తున్నారు
- Author : Hashtag U
Date : 03-05-2022 - 10:05 IST
Published By : Hashtagu Telugu Desk
కర్ణాటకలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో కర్ణాటక బీజేపీలో నాయకత్వ మార్పు ఉంటుందని అందరు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్నందున రాష్ట్రంలో నాయకత్వ మార్పు వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగాయి. అమిత్ షా తన పర్యటనలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో సమావేశమై రాష్ట్రంలోని రాజకీయ దృశ్యంపై చర్చలు జరిపి, బిజెపి ఎన్నికల సన్నాహాలను సమీక్ష చేయనున్నట్లు సమాచారం.కేబినేట్ విస్తరణ కూడా అజెండాలో ఉన్నట్లు బీజేపీ నేతలు చెప్తున్నారు. గత సంవత్సరం రాజకీయ గందరగోళాల మధ్య సిఎం పదవి నుండి యడ్యూరప్పని తప్పించారు. అనంతరం బసవరాజు బొమ్మైని సీఎంగా బీజేపీ అధిష్టానం ప్రకటిచింది.
మంగళవారం బొమ్మై అధికారిక నివాసంలో భోజనం చేసి, సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అమిత్ షా చివరిసారిగా ఏప్రిల్ 1న రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు, ఈ సమయంలో 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్ల మార్కును దాటాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర రాజకీయ పార్టీల నాయకుల చేరికలు, ఎన్నికలకు సిద్ధం కావడానికి సంస్థను బలోపేతం చేయడంపై కూడా కమిటీ చర్చించింది.
రాజకీయ భేటీలతొ పాటు.. మంగళవారం బెంగళూరులో ‘ఖేలో ఇండియా’ యూనివర్శిటీ గేమ్స్ యొక్క వేడుకతో సహా పలు కార్యక్రమాలకు అమిత్ షాహాజరుకానున్నారు. బసవ జయంతి సందర్భంగా 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త , లింగాయత్ సన్యాసి బసవన్నకు కూడా ఆయన నివాళులర్పిస్తారు. నృపతుంగ విశ్వవిద్యాలయం, బళ్లారిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ ఇ-ప్రారంభోత్సవం, బెంగళూరు NATGRID క్యాంపస్ ప్రారంభోత్సవం వంటి వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలో కూడా హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారు.
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని కేంద్ర నాయకత్వం భావిస్తుంది.
ఇటీవల కాలంలో కర్ణాటక బీజేపీ ప్రభుత్వం వివాదాలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో నాయకత్వాన్ని మర్చే ఆలోచనలో అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో హిజాబ్ నిరసనల చేలరేగడం, మాజీ క్యాబినెట్ మంత్రి KS ఈశ్వరప్ప అవినీతి, వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన సివిల్ కాంట్రాక్టర్ మరణంతో బసవరాజ్ బొమ్మై పాలన ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం మార్పు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.