Team India @Asia Cup: ఆసియా కప్…ఇది భారత్ అడ్డా
ఆసియా దేశాల మధ్య జరిగే క్రికెట్ సమరంలో అత్యంత విజయవంతమయిన జట్టు టీమిండియానే. 1984 నుంచి ఆసియా కప్ నిర్వహణ ఆరంభమైంది.
- By Naresh Kumar Published Date - 09:59 AM, Sat - 27 August 22

ఆసియా దేశాల మధ్య జరిగే క్రికెట్ సమరంలో అత్యంత విజయవంతమయిన జట్టు టీమిండియానే. 1984 నుంచి ఆసియా కప్ నిర్వహణ ఆరంభమైంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎన్నో భారీ రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఈ టోర్నీలో భారత్ ఆధిక్యం ప్రదర్శించింది. ఎప్పుడు టోర్నీ జరిగినా అత్యంత బలమైన జట్టు భారతే ఇప్పటి వరకు ఈ టోర్నీలో టీమిండియా 7 సార్లు విజేతగా నిలిచింది. భారత్ తర్వాత శ్రీలంక 5 సార్లు, పాకిస్థాన్ 2 సార్లు గెలుపొందాయి. భారత జట్టు ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు మొత్తం 54 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 36 విజయాలు అందుకుంది. ఒక మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం తేలకపోగా.. అఫ్ఘనిస్తాన్‌పై మరో మ్యాచ్ టైగా ముగిసింది.
భారత్‌తో సమానంగా శ్రీలంక 54 మ్యాచ్‌లు ఆడగా అందులో 35 విజయాలు ఉన్నాయి. భారత్ కంటే ఒక్క విజయమే శ్రీలంకకు తక్కువగా ఉంది. ఇక పాకిస్తాన్ మొత్తం 49 మ్యాచ్‌లు ఆడి 28 విజయాలు సాధించింది.
ఇదిలా ఉంటే ఆసియా కప్‌లో 50 ఓవర్లు, 20 ఓవర్ల ఫార్మాట్‌లో విజయం సాధించిన ఏకైక జట్టు భారత జట్టు. ఇక పలు రికార్డుల్లో కూడా భారత్ ఆటగాళ్లు తమదయిన ఆధిపత్యం కనబరిచారు.
అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రీలంక మాజీ క్రికెటర్ సనన్ జయసూర్య ఉన్నాడు. 25 మ్యాచుల్లో 53 సగటుతో 1,220 పరుగులు చేశాడు. దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ భారత్ తరపున అత్యధిక పరుగులు చేశాడు. 21 మ్యాచ్‌లు ఆడి 971 పరుగులు చేశాడు.
అత్యధిక వ్యక్తిగత స్కోరు విషయంలో విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. 148 బంతుల్లో 183 పరుగులు చేశాడు. అత్యధిక వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. 24 మ్యాచుల్లో 30 వికెట్లు తీశాడు.
అదే సమయంలో, ఇర్ఫాన్ పఠాన్ ఆసియా కప్‌లో భారతదేశం నుంచి అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీశాడు.మొత్తం మీద ఓవరాల్ గా ఆసియా కప్ లో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఈ సారి డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోన్న భారత్ తన డామినేషన్ కంటిన్యూ చేయాలని ఉత్సాహంగా ఎదురు చూస్తోంది.