The Hijab : మరింత ముదురుతున్న హిజాబ్ రగడ
- Author : HashtagU Desk
Date : 16-02-2022 - 4:50 IST
Published By : Hashtagu Telugu Desk
కర్నాటక హిజాబ్ రగడకు ఇప్పట్లో పుల్‌స్టాప్ పడేలా కనిపించడం లేదు. మొదట కర్నాటకలోని ఉడిపిలో చెలరేగిన ఈ హిజాబ్ వివాదం క్రమ క్రమంగా ముదరడంతో, అక్కడి విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్నాటకలో వారం రోజులుగా మూతపడిన స్కూళ్ళు, కాలేజీలు బుధవారం తిరిగి తెరుచుకున్నాయి. అయితే పలు ప్రాంతాల్లో అనగా, శివమొగ్గ, హసనా, రాయచూరు, కొడగు,విజయపుర, బిజాపుర్, కలబుర్గి ప్రాంతాల్లో కొంత మంది ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి కాలేజీలకు హాజరయ్యారు.
ఈ నేపధ్యంలో హిజాబ్ వేసుకుంటే లోపలికి రానిచ్చేది లేదని విజయపురలోని గవర్నమెంట్ పీయూ కాలేజ్ స్పష్టం చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఎవరినీ హిజాబ్‌తో అనుమతించేది లేదని కాలేజీ ప్రిన్సిపాల్ తేల్చిచెప్పారు. ఎలాంటి మతపరమైన వస్త్రధారణకు అనుమతి లేకుండా విద్యాసంస్థలను నడపాలన్న హైకోర్టు ఉత్తర్వులనే తాము అనుసరిస్తున్నామని తేల్చి చెప్పారు. దీంతో విద్యార్థులంతా కాలేజీ బయట ఆందోళనకు దిగారు. కొందరు మహిళా పోలీసులనూ అక్కడ భద్రతగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడి కళాశాలల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాలేజీల వద్ద 144 సెక్షన్‌ను విధించారు.