Bengaluru : బెంగుళూరులో భారీ వర్షం.. అండర్‌పాస్‌లో వరదలో చిక్కుకున్న కారు
బెంగళూరులో భారీ వర్షం కురిసింది. బెంగుళూరులో విధానసౌధకు కూతవేటు దూరంలో ఉన్న కేఆర్ సర్కిల్ అండర్‌పాస్ వద్ద ఓ
- By Prasad Published Date - 10:00 PM, Sun - 21 May 23

బెంగళూరులో భారీ వర్షం కురిసింది. బెంగుళూరులో విధానసౌధకు కూతవేటు దూరంలో ఉన్న కేఆర్ సర్కిల్ అండర్‌పాస్ వద్ద ఓ కారు వరదలో చిక్కుకుంది. కారులో ఓ కుటుంబం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది కుటుంబంలోని మరో ఐదుగురిని, డ్రైవర్‌ను రక్షించారు.వీరిని సెయింట్ మార్తాస్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, కారులో ఉన్న భానురేఖ అనే మహిళ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. మృతురాలి కుంటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం, ఆసుపత్రిలో చేరిన వారికి ఉచిత వైద్యం అందజేస్తామని ఆయన ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఓ కుటుంబం కారు అద్దెకు తీసుకుని బెంగళూరు చూసేందుకు వచ్చారు. భానురేఖ బెంగుళూరులోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. కుండపోత వర్షం కారణంగా అండర్‌పాస్ వద్ద ఉన్న బారికేడ్ కిందపడిపోయింది. అదే సమయంలో డ్రైవర్ అండర్‌పాస్‌ను దాటడానికి ప్రయత్నించగా ప్రమాదం జరిగింది. సజీవంగా ఉన్న భానురేఖను ఆస్పత్రికి తరలించే సమయంలో వైద్యులు చికిత్స చేసేందుకు నిరాకరించారని ఘటనను కవర్ చేస్తున్న విలేకరులు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న వారు తెలిపిన వివరాల ప్రకారం, కారు డ్రైవర్ వరద నీటిలోకి పోనిచ్చారని.. అయితే అండర్‌పాస్ మధ్యలో కారు దాదాపు మునిగిపోయింది. వాహనంలో ఉన్నవారు ప్రాణాలతో బయటికి వచ్చేందుకు ప్రయత్నించారు.కుండపోత వర్షం, వడగళ్ల వాన కారణంగా నీటి మట్టం పెరగడం ప్రారంభమైంది. సహాయం కోసం కుటుంబీకులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వారిని రక్షించేందుకు ముందుకు వచ్చారు. వారిని రక్షించేందుకు చీరలు, తాళ్లు విసిరారు. చిక్కుకున్న వారు పైకి ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వీరిలో ఇద్దరిని అత్యవసర సేవల సిబ్బంది, గజ ఈతగాళ్లు బయటకు లాగగా, మరికొందరిని నిచ్చెన ఉపయోగించి బయటకు తీసుకొచ్చారు. ప్రాణాలతో బయటపడిన వారిని ఆస్పత్రికి తరలించగా అక్కడ భానురేఖ మృతి చెందింది. ప్రాణాలతో బయటపడిన వారు భానురేఖ మృతదేహాన్ని చూసి ఆసుపత్రి వద్ద కన్నీటిపర్యంతమయ్యారు.
కేఆర్‌సర్కిల్ వద్ద ఓ ఆటోరిక్షా కూడా ఇరుక్కుపోగా, వాహనంపైకి ఎక్కి ఓ మహిళా ప్రయాణికురాలు ప్రాణాలను కాపాడుకుంది. నగరంలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. నగరంలోని ప్రధాన ప్రాంతమైన మహాలక్ష్మి లేఅవుట్ వద్ద ఇళ్లలోకి నీరు చేరి ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలు దెబ్బతిన్నాయి. మల్లేశ్వరం, రాజాజీ నగర్‌తో పాటు శ్రీరాంపురం, కెంగేరిలోని కొన్ని ప్రాంతాలు, మైసూరు రోడ్డు మరియు అనేక ఇతర లోతట్టు ప్రాంతాలతో సహా అనేక ఇతర ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలడంతో ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. చెట్లు కూలడంతో ట్రాఫిక్ స్తంభించింది.

Related News

IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్ కు వర్షం అడ్డంకి… మ్యాచ్ జరగకుంటే ఎవరిది టైటిల్ ?
అభిమానులు ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫైనల్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా 7.30 గంటలకు ఆరంభం కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా మరింత ఆలస్యం కానుంది.