Hindi imposition: విషాదం.. హిందీ వద్దంటూ డీఎంకే కార్యకర్త ఆత్మహత్య
హిందీ భాషను తమపై రుద్దొదంటూ డీఎంకే సీనియర్ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
- By Gopichand Published Date - 09:31 PM, Sat - 26 November 22

హిందీ భాషను తమపై రుద్దొదంటూ డీఎంకే సీనియర్ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన 85 ఏళ్ల తంగవేల్ తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యా మాధ్యమంగా హిందీని తీసుకురావడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే శరీరం మొత్తం కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిప్పంటించే ముందు తెల్లకాగితంపై ఓ వచనం కూడా రాశాడు. అందులో.. “కేంద్ర ప్రభుత్వానికి హిందీ మాతృభాష అక్కర్లేదు. తమిళం మాతృభాష హిందీ ఎందుకు” అని పేర్కొన్నారు. హిందీని విధించడాన్ని నిరసిస్తూ డీఎంకే కార్యకర్త ఒకరు నిప్పంటించుకున్న ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
సేలం జిల్లా నంగవల్లి ప్రాంతంలోని దహల్యూర్‌కు చెందిన డీఎంకే వ్యవసాయ బృందం మాజీ ఆర్గనైజర్ తంగవేల్ (85) హిందీని విధించడాన్ని వ్యతిరేకిస్తూ నిప్పంటించుకున్నాడు. ఆయన మృతికి డిఎంకె నాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం తెలిపారు. ఎవరూ నిరసనగా ప్రాణనష్టం చేసే చర్యలకు పాల్పడవద్దని అభ్యర్థించారు. భిన్నత్వంతో కూడిన అందమైన దేశాన్ని సంకుచిత మనస్తత్వం పాడు చేయనివ్వవద్దు. ఆధిపత్య ధోరణిలో హిందీని రుద్దుతున్న కేంద్రప్రభుత్వానికి ‘హిందీని విధించవద్దు’ అనే నినాదం చెవులకు, గుండెలకు చేరేంత వరకు మేం విశ్రమించబోం. తాళ్లయూర్ తంగవేలు కుటుంబ సభ్యులకు, బంధువులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని స్టాలిన్ తెలిపారు.