Karur Stampede : 41 మంది చనిపోయిన విజయ్ పరామర్శ లేదంటూ విమర్శలు
Karur Stampede : ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. సహాయం కోసం చేరుకున్న ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రాంతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం రేపింది
- By Sudheer Published Date - 10:30 AM, Tue - 30 September 25

తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట (Karur Stampede) ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్ర విషాదంలో ముంచేసింది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. సహాయం కోసం చేరుకున్న ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రాంతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సంఘటన స్థలంలో సరైన భద్రతా చర్యలు లేకపోవడం, తగిన నియంత్రణలు పాటించకపోవడం కారణంగా ప్రమాదం తీవ్రరూపం దాల్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Kidney Stones: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
ఈ ఘటన జరిగినప్పటి నుంచి టీవీకే (TVK) అధినేత విజయ్ (Vijay) ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగగా కూడా ఆయన ఇప్పటివరకు బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించకపోవడం, కనీసం ప్రెస్ మీట్ కూడా నిర్వహించకపోవడం రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. ‘ఆ ఘటనతో నా గుండె పగిలింది’ అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మాత్రమే చేయడం ఆయనకు రాజకీయ పరిణతి ఇంకా రాలేదనే అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ప్రజాసేవలో ఉన్న నాయకుడు ఇలాంటి సందర్భాల్లో తక్షణమే స్పందించి బాధితులకు ధైర్యం చెప్పాల్సిన అవసరముందని విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు విజయ్ పరిహారం ప్రకటించారని, ప్రస్తుతం ఆయన షాక్లో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ప్రజలు మరియు రాజకీయ విశ్లేషకులు నాయకత్వంలో ఉన్నవారు ఎటువంటి వ్యక్తిగత భావోద్వేగాలనైనా పక్కన పెట్టి బాధితులకు తక్షణమే సహాయం చేయడం, ప్రజలతో నేరుగా మమేకం కావడం మౌలిక ధర్మమని అంటున్నారు. ఈ ఘటన ద్వారా విజయ్ రాజకీయంగా మరింత పరిపక్వత సాధించాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు చేపట్టడం, ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం ఆయనకు పెద్ద సవాలుగా మారనుంది.