Kidney Stones: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి గల కారణం, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి నివారణ ఏంటి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:30 AM, Tue - 30 September 25

Kidney Stones: ప్రస్తుత రోజుల్లో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అనే వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఈ సమస్యతో బాధపడేవారు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, వంటి వాటితో నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. కిడ్నీలో ఏర్పడే ఈ రాళ్లు కేవలం పరిమాణంలోనే కాకుండా, వాటి కూర్పులో కూడా తేడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటి గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మూత్రపిండాల్లో రాళ్లు అంటే ఖనిజాలు, యాసిడ్ లవణాలతో ఏర్పడే చిన్న, గట్టి పదార్థాలు. ఇవి మొదట్లో చిన్నగా, లక్షణాలు కనిపించకుండా ఉంటాయి. కానీ కొన్నిసార్లు అవి పెద్దవిగా కూడా మారవచ్చు. ఈ రాళ్లు మూత్రపిండాల నుంచి మూత్రనాళం గుండా ప్రయాణించినప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుందట. అలాగే మనం తినే ఆహారం, లేదా కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కిడ్నీ రాళ్లు వివిధ రకాలుగా ఏర్పడతాయని చెబుతున్నారు. కాగా కిడ్నీలో రాళ్ల సమస్యను నాలుగు ప్రధాన రకాలను పేర్కొన్నారు. అవి కాల్షియం రాళ్లు, యూరిక్ యాసిడ్ రాళ్లు, స్ట్రువైట్ రాళ్లు, సిస్టిన్ రాళ్లు అని నాలుగు రకాలు ఉన్నాయి.
ఇకపోతే కిడ్నీ రాళ్లు ఉన్నాయి అని తెలిసిన తర్వాత తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోవడం తప్పనిసరి. డీహైడ్రేషన్ కిడ్నీ రాళ్లకు ప్రధాన కారణాల్లో ఒకటిగా చెప్పవచ్చు. తగినంత నీరు తాగనప్పుడు మూత్రం చిక్కగా మారుతుందని, అప్పుడు ఖనిజాలు స్ఫటికాలుగా మారి గట్టిపడతాయట. డీహైడ్రేషన్ తో పాటు, సోడియం, జంతు మాంసం, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఊబకాయం, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కిడ్నీ రాళ్లకు దారితీస్తాయని చెబుతున్నారు. రోజుకు కనీసం 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగడం, తగినంత ద్రవ పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు.
వీటితో పాటు, తక్కువ సోడియం ఉన్న ఆహారం, జంతు మాంసం తగ్గించడం కూడా మంచిదే అని చెబుతున్నారు. అలాగే అధికంగా బీర్ తాగితే కిడ్నీ రాళ్లు కరిగిపోతాయని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవానికి, అధిక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. మాములుగా కిడ్నీ రాళ్ల నిర్ధారణ కోసం సాధారణంగా అల్ట్రాసౌండ్ చేస్తారు. అల్ట్రాసౌండ్ పరీక్ష అన్ని సందర్భాల్లోనూ సరైన ఎంపిక కాకపోవచ్చని చెబుతున్నారు. దీనికి బదులుగా సీటీ స్కాన్ చేయించుకోవాలని ఆయన సూచించారు. ఎందుకంటే ఇది పరిస్థితిని చాలా స్పష్టంగా చూపిస్తుందట. చికిత్స పద్ధతి సాధారణంగా రాయి పరిమాణంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.