Udhayanidhi Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి త్వరలో మంత్రిపదవి?
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, చెన్నై చేపాక్కం-ట్రిప్లికేన్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌కు మంత్రివర్గంలో చోటు ఖరారైందా?
- By Hashtag U Published Date - 12:31 PM, Wed - 1 June 22

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, చెన్నై చేపాక్కం-ట్రిప్లికేన్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌కు మంత్రివర్గంలో చోటు ఖరారైందా? ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలన్నది డీఎంకేలో ఇప్పుడు బలంగా వినిపిస్తున్న డిమాండ్. స్టాలిన్ ఇప్పుడు డెల్టా జిల్లాల పర్యటనలో ఉన్నారు. అదే సమయంలో ఆ ప్రాంతంలోని దిండుగల్, తిరుచ్చి, తంజావూర్ జిల్లాల్లోని మంత్రులంతా తమ పరివారాలతో ఈమేరకు తీర్మానాలు కూడా చేసేశారు.
ఉదయనిధి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంతా భావించారు. కానీ అలా చేస్తే.. పార్టీ వ్యతిరేకులకు అవకాశం ఇచ్చినట్టవుతుందని.. అక్కడికీ వారసుడికి టిక్కెట్ ఇచ్చారని.. డీఎంకేలో కుటుంబ రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయని విమర్శలొచ్చాయి. అందుకే స్టాలిన్ ఆ పనిచేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిపోయింది. పైగా ఈనెల 3న కరుణానధి జయంతి కూడా. ఆలోగా మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. సరిగా పనిచేయని మంత్రులను పక్కకుపెట్టి.. కొత్తవారికి మంత్రులుగా చోటు కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా ఉదయనిధికి కూడా మంత్రిపదవి ఇవ్వొచ్చని డీఎంకే వర్గాలు భావిస్తున్నాయి.
మంత్రులు, పార్టీ నాయకుల ద్వారా ఉదయనిధికి మంత్రిపదవి ఇవ్వాలన్న డిమాండ్ ను వినిపించి దాని ద్వారా ప్రజల నాడి తెలుసుకోవాలన్నది పార్టీ అధిష్టానం వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు, లేకపోతే ఒకేరోజు మూడు జిల్లాల్లో.. కార్యవర్గ సమావేశాల్లో సేమ్ టూ సేమ్ ఒకే రకం తీర్మానాన్ని ఎలా చేయగలుగుతారు? ఇక ఉదయనిధి మాత్రం తాను యువజన విభాగం కార్యదర్శిగా పార్టీని యువతకు చేరువ చేయడానికి ప్రయత్నిస్తున్నానని.. ఇలాంటి సమయంలో అధిష్టానం మరో ఆలోచనలో పడేటట్లుగా ఎవరూ చేయవద్దని ఓ లేఖ విడుదల చేశారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. ఉదయనిధి త్వరలో మంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది.