Apple Company: యాపిల్ కు మరో షాక్.. కీలక ఉద్యోగి రాజీనామా
యాపిల్ సీనియర్ డిజైనర్ పీటర్ రస్సెల్ క్లార్క్ బయటకు వచ్చేశారు. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. క్లార్క్ యాపిల్ కంపెనీలో పనిచేసే సీనియర్ డిజైన్లలో ఒకరు.
- By News Desk Published Date - 09:11 PM, Tue - 19 December 23

Apple Company: ప్రముఖ టెక్ దిగ్గజమైన యాపిల్ కు మరో భారీ షాక్ తగిలింది. 2023లో డజన్ కు పైగా సీనియర్ ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేయగా.. తాజాగా మరో సీనియర్ ఉద్యోగి బయటికొచ్చారు. యాపిల్ సీనియర్ డిజైనర్ పీటర్ రస్సెల్ క్లార్క్ బయటకు వచ్చేశారు. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. క్లార్క్ యాపిల్ కంపెనీలో పనిచేసే సీనియర్ డిజైన్లలో ఒకరు. యాపిల్ ప్రొడక్ట్స్ అయిన ఐమాక్, ఐపాడ్ నానో, మాక్ బుక్ ప్రో, మాక్ బుక్ ఎయిర్ తో పాటు ఇతర ప్రొడక్ట్స్ లోని హార్డ్ వేర్ లను డిజైన్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. యాపిల్ హెడ్ క్వార్టర్స్, ఇతర యాపిల్ రిటైల్ స్టోర్ల డిజైన్స్ లోనూ పీటర్ రస్సెల్ క్లార్క్ భాగస్వామ్యం ఉంది.
యాపిల్ కంపెనీలో 1000కి పైగా పేటెంట్ రైట్స్ క్లార్క్ పేరుమీదే ఉన్నాయి. అలాంటి డిజైనర్ కుపెర్టినో దిగ్గజం కోల్పోవడం పెద్ద ఎదురు దెబ్బేనని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో యాపిల్ కు రిజైన్ చేసిన క్లార్క్ స్పేస్ టెక్నాలజీ కంపెనీ వాస్ట్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. సదరు కంపెనీ తయారు చేసే ప్రొడక్టులపై సలహాలు ఇచ్చేలా సలహాదారుగా బాధ్యతలు చేపట్టనున్నారు.