Oka Pathakam Prakaram : ఒక పథకం ప్రకారం మూవీ రివ్యూ..
- By News Desk Published Date - 09:04 PM, Fri - 7 February 25

Oka Pathakam Prakaram : పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్(Sai Ram Shankar) లాంగ్ గ్యాప్ తర్వాత ‘ఒక పథకం ప్రకారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గార్లపాటి రమేష్, వినోద్ కుమార్ విజయన్ నిర్మాతలుగా మలయాళం డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఒక పథకం ప్రకారం సినిమా నేడు ఫిబ్రవరి 7న రిలీజ్ అయింది.
కథ :
సిద్దార్థ్ నీలకంఠ(సాయి రామ్ శంకర్) పబ్లిక్ ప్రాసిక్యూటర్. కానీ అతను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి సీత(ఆషిమా నర్వాల్) సడెన్ గా కనపడకుండా పోవడంతో బాధపడుతూ డ్రగ్స్ కి అలవాటు అవుతాడు. దాంతో అతన్ని సస్పెండ్ చేస్తారు. అనుకోకుండా సిద్దార్థ్ ఫ్రెండ్ దివ్య(భానుశ్రీ) హత్యకు గురవుతుంది. ఆ హత్య సిద్దార్థ్ చేసాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మరో హత్య కూడా ఇతనే చేసారని అనుమానిస్తారు. వరుసగా మర్డర్స్ జరుగుతూ అన్నిచోట్లా సిద్దార్థ్ చేసాడని అనుమానం వచ్చేలా ఎవిడెన్స్ ఉంటాయి. దీంతో సిద్దార్థ్ ఏసిపి కవిత(శృతిసోది)తో కలిసి ఈ మర్డర్స్ ని సాల్వ్ చేయాలని చూస్తాడు. అసలు వరుస హత్యలు ఎవరు చేస్తున్నారు? సిద్దార్థ్ ని ఎందుకు ఇందులో ఇరికిస్తున్నారు? ఒకవేళ సిద్దార్థ్ నిజంగానే ఈ హత్యలు చేశాడా? సిద్దార్థ్ భార్య సీత దొరికిందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
నటీనటులు :
రెగ్యులర్ గా ఫుల్ మాస్, కమర్షియల్ రోల్స్ చేసే సాయి రామ్ శంకర్ ఈసారి ఓ కొత్త లుక్ తో సీరియస్ యాక్టింగ్ చేసి అదరగొట్టాడు. హీరోయిన్ అషిమా నర్వాల్ కాసేపు అలరిస్తుంది. శృతి సోది పోలీస్ పాత్రలో బాగానే మెప్పిస్తుంది. మరో పోలీస్ పాత్రలో సముద్రఖని నవ్విస్తారు. కమెడియన్ సుధాకర్, విలన్ గా నటించిన నటుడు, మిగిలిన పాత్రలు కూడా వారి పాత్రల్లో మెప్పిస్తారు.
విశ్లేషణ :
ఫస్ట్ హాఫ్ సిద్దార్థ్, అతని ప్రేమ గురించి, సీత మిస్ అవ్వడం, సిద్దార్థ్ సస్పెండ్ అవ్వడం, వరుస హత్యలు జరగడం, సిద్దార్థ్ ని పోలీసులు అరెస్ట్ చేయడంతో సాగుతుంది. ఫస్ట్ ఆఫ్ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి మాత్రం కథ బాగానే నడుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే విలన్ ఎవరు కనిపెట్టే ప్రాసెస్, అతను ఎందుకు హత్యలు చేస్తున్నాడు అనే కథ చాలా ఆసక్తిగా సాగుతుంది.
రెగ్యులర్ గా ఫుల్ యాక్టివ్ గా ఉండే పాత్రలు చేసే సాయి రామ్ శంకర్ మొదటిసారి ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేయడం, ప్రమోషన్స్ లో ఇంటర్వెల్ లోపు విలన్ ని పట్టుకుంటే పదివేలు ఇస్తాం అని ప్రకటించడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఒకవేళ విలన్ ని గెస్ చేసినా అతను ఎలా విలన్ అయ్యాడు అనేది మాత్రం కనిపెట్టడం కష్టమే. ప్రీ క్లైమాక్స్ లో విలన్ ని కనిపెట్టే ప్రాసెస్ వేగవంతం అయిన దగ్గర్నుంచి సినిమా పరిగెడుతూ మరింత ఆసక్తి కలిగిస్తుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కావాలనుకునే వాళ్ళు థియేటర్స్ కి వెళ్లి చూసేయండి. ఈ సినిమాతో సాయి రామ్ శంకర్ కంబ్యాక్ ఇస్తాడని భావిస్తున్నారు.
సాంకేతిక అంశాలు : సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అక్కడక్కడా భయపెట్టారు. పాటలు యావరేజ్. ఒక సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ ని మంచి స్క్రీన్ ప్లేతో దర్శకుడు బాగా రాసుకున్నాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.
సినిమా ప్లస్ లు :
సాయి రామ్ శంకర్ నటన
స్క్రీన్ ప్లే
విలన్ అతనే ఎందుకు అని చివరి వరకు హోల్డ్ చేయగలగడం
మైనస్ లు :
సాంగ్స్
ఫస్ట్ హాఫ్ లో కాస్త సాగదీత
రేటింగ్ : 2.75/ 5
Alaso Read : Arrest Warrant Against Sonu Sood: సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ కేసులో చిక్కుకున్నాడు?