Devara Review Rating : దేవర రివ్యూ & రేటింగ్
- By Ramesh Published Date - 08:15 AM, Fri - 27 September 24

నటీనటులు : ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శృతి మరాఠే, శ్రీకాంథ్, ఆజయ్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ తదితరులు.
సంగీత దర్శకుడు : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ : రత్నవేలు
దర్శకుడు : కొరటాల శివ
నిర్మాత : మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్
Devara Review Rating ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా దేవర. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో తారక్ తో జాన్వి కపూర్ జత కట్టింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ అంచనాలు పెంచాయి. నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో HashtagU సమీక్షలో చూద్దాం.
కథ :
1996 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగే టైం లో స్టేడియాల మీద బాంబ్ దాడి ప్లాన్ జరుగుతుంది. ఐతే దానికి కారణమైన యతి అనే గ్యాంగ్ స్టర్ ని పట్టుకునేందుకు శివం (అజయ్) టీం యతి కోసం వెతుకుతూ ఆంధ్రా తమిళనాడు బోర్డర్ లో ఉన్న రత్నగిరికి వస్తారు. అక్కడ సింగప్ప (ప్రకాష్ రాజ్) దేవర గురించి చెబుతాడు. 12 ఏళ్ల క్రితం రత్నగిరికి భయం అంటే ఏంటో చూపించిన దేవర కథ చెబుతాడు. రత్నగిరిలో దేవరతో పాటు భైర (సైఫ్), రాయప్ప (శ్రీకాంత్), కుంజ (కళయరసన్), కోర (షేన్ చామ్ టాకో) కలిసి సముద్రంపై వేటకు వెళ్తుంటారు. ఐతే వారికి మురుగ (మురళి శర్మ) వారికి భారీగా డబ్బు వచే పని చెబుతాడు. సముద్రంలో షిప్ ల నుంచి కంటైనర్లను దొంగలించే పని ఇస్తాడు. దేవర కూడా ముందు ఓకే అన్నా సరే ఆ తర్వాత మనసు మార్చుకుంటాడు. ఐతే భైరా దేవరని వ్యతిరేకిస్తాడు. అలాంటి వారికి భయం అంటే ఏంటో చూపిస్తాడు దేవర. అప్పుడు భైరా దేవరని మట్టుపెట్టాలని చూస్తాడు. విషయం తెలుసుకున్న దేవర ఏం చేశాడు..? దేవర కొడుకు వర పిరికివాడిగా ఎందుకు ఉంటాడు. తంగం (జాన్వి) పాత్ర ఏంటి..? దేవర వర కలుసుకున్నారా లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్య పోరాటం అందులోనూ వారిద్దరు ముందు స్నేహితులుగా ఉండి ఆ తర్వాత ఒకరితో ఒకరి కొట్లాట జరపడం అనేది ఆ పాత్రలు ఆడియన్స్ కు ఎంత బాగా కనెక్ట్ అయితే అంత వారికి ఎక్కేస్తుంది. దేవర (Devara Review Rating) సినిమాలో దేవర, భైరాల మధ్య వైరం ప్రేక్షకులను హై మూమెంట్స్ కి తీసుకెళ్లాలి కానీ అక్కడ ఎందుకో ఆ కనెక్టివిటీ రాలేదు. ఫస్ట్ హాఫ్ అంతా దేవర భైరా నేపథ్యం చూపించిన కొరటాల శివ వారి మధ్య కన్ ఫ్లిక్ట్ ని రొటీన్ చేశాడు.
దేవరని అంతం చేయాలని చూసిన భైరాకు తాను అదృశ్యం అయ్యి భయం కలిగించాలని అనుకోవడం కొత్త పాయింట్. దేవర లో ఫస్ట్ హాఫ్ కొన్ని హై మూమెంట్స్ తో నడుస్తుంది. ఇంటర్వెల్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. సెకండ్ హాఫ్ దానికి తగినట్టుగా ఉంటే సినిమా మరో లెవెల్ లో ఉండేది. కానీ సెకండ్ హాఫ్ వర, తంగం ల పాత్రలు కొంత మేరకు బాగున్నా ఎందుకో సినిమా డ్రాగ్ అయినట్టుగా అనిపిస్తుంది.
దేవర సినిమాలో క్యారెక్టరైజేషన్స్ గురించి ఎక్కువ ఆలోచించిన కొరటాల శివ వాటి కనెక్టివిటీ ఇంకా ఆడియన్స్ కు ఆ పాత్రలను ఎక్కించడంలో విఫలమయ్యాడు. సినిమా కొరటాల శివ మార్క్ మూవీనే కానీ ఇదివరకు ఆయన సినిమాలో ఉన్న మ్యాజిక్ కనిపించదు. ముఖ్యంగా దేవర లాంటి సినిమా ఎన్నో భారీ అంచనాలతో వస్తుంటే ఊహాజనిత కథ కథనాలతో రావడం ప్రేక్షకులను నిరుత్సాపరుస్తుంది.
దేవర సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఐతే బాగా నచ్చేస్తుంది. కామన్ ఆడియన్స్ కు మాత్రం సినిమా అంతగా ఎక్కే ఛాన్స్ లేదు. సినిమా లెంగ్త్ ఎక్కువ అవ్వడం కూడా కొంత ఇంపాక్ట్ పడేలా చేసిందని చెప్పొచ్చు.
నటీనటులు :
తెలుగు స్టార్స్ లో ఎన్టీఆర్ ఎప్పుడు బెస్ట్ యాక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు. దేవర సినిమాలో కూడా దేవర, వర రెండు పాత్రల్లో అదరగొట్టాడు. ముఖ్యంగా వర పాత్రలో అమాయకత్వం చిలిపితనం.. దేవర పాత్రలో హీరోయిజం ఫ్యాన్స్ కి నచ్చుతుని. భైర పాత్రలో సైఫ్ ఇంప్రెస్ చేశాడు. జాన్వి కూడా ఉన్నంతవరకు ఓకే అనిపిస్తుంది. తెర మీద జాన్వి అందాలు ఆడియన్స్ కు ట్రీట్ అందిస్తాయి. శ్రీకాంత్, మురళి శర్మ, ప్రకాష్ రాజ్ ఇలా అందరు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం :
దేవర విషయంలో అనిరుద్ వావ్ అనిపించాడు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నిటిలో తన మార్క్ చూపించాడు. దేవర హైలెట్స్ లో అనిరుద్ మ్యూజిక్ ఒకటని చెప్పొచ్చు. కెమెరాన్ మెన్ రత్నవేలు కూడా తన బెస్ట్ ఇచ్చాడు. సినిమా ఎక్కువ డార్క్ మోడ్ లో ఉంటుంది. దానికి తగినట్టుగా లైటింగ్ అంతా పర్ఫెక్ట్ గా క్యాచర్ చేశారు. ఇక కథ కథనాల్లో డైరెక్టర్ కొరటాల శివ ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత కావాలో అంత పెట్టారు.
ప్లస్ పాయింట్స్ :
ఎన్ టీ ఆర్ నటన
అనిరుద్ మ్యూజిక్
కొన్ని హై మూమెంట్స్
మైనస్ పాయింట్స్ :
ఊహాజనిత కథనం
అక్కడక్కడ స్లో అవ్వడం
బాటం లైన్ :
దేవర ఓన్లీ ఫర్ ఫ్యాన్స్..!
రేటింగ్ : 2.5/5