Max : ‘మ్యాక్స్’ మూవీ రివ్యూ..
- By News Desk Published Date - 10:38 PM, Thu - 26 December 24

Max : కిచ్చ సుదీప్(Kichcha Sudeep) హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా ‘మ్యాక్స్’. కన్నడలో డిసెంబర్ 25న రిలీజవ్వగా తెలుగులో రేపు డిసెంబర్ 27న రిలీజ్ కానుంది. ఒక రోజు ముందే ప్రీమియర్స్ వేశారు. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో S థాను నిర్మాతగా వరలక్ష్మి శరత్ కుమార్, సునీల్, ఇళవరసు, రెడీన్ కింగ్స్లీ.. పలువురు ముఖ్య పాత్రలతో ఈ సినిమా తెరకెక్కింది.
సినిమా కథ :
అర్జున్ అలియాస్ మ్యాక్స్ (కిచ్చ సుదీప్) ఓ కొత్త ఊరికి పోలీస్ ఛార్జ్ తీసుకోడానికి వస్తాడు. రాత్రి ట్రైన్ దిగి ఇంటికి వెళ్తుంటే రోడ్డు మీద గంజాయి తాగిన మైఖేల్, వీర అనే ఇద్దరు మంత్రి కొడుకులు తాను ఛార్జ్ తీసుకోవాల్సిన స్టేషన్ పరిధిలోనే పోలీసులని కొట్టి, లేడీ పోలీస్ తో మిస్ బిహేవ్ చేస్తారు. దీంతో పోలీస్ గా ఛార్జ్ తీసుకోకుండానే ఆ ఇద్దర్ని తీసుకెళ్లి జైలులో వేసి వెళ్ళిపోతాడు అర్జున్. పోలీసులు అంతా పలు కారణాలతో స్టేషన్ నుంచి బయటకు వెళ్లి వచ్చేసరికి ఆ ఇద్దరూ కుర్రాళ్ళు చనిపోయి ఉంటారు. ఈ విషయం తెలిసి అర్జున్ స్టేషన్ కి వస్తాడు. వీరి వెనక ఉన్న గ్యాంగ్ స్టార్స్, మంత్రులు వాళ్ళని చంపేస్తారని పోలీసులు భయపడుతూ ఉంటారు. దీంతో అర్జున్ తన తోటి ఉద్యోగులను కాపాడాలని, ఆ ఇద్దరూ అసలు ఏమయ్యారో తెలియకుండా చేయాలని చూస్తాడు. కానీ అప్పటికే వీళ్ళను అరెస్ట్ చేశారనే విషయం తెలిసి క్రైమ్ పోలీస్ రూప(వరలక్ష్మి శరత్ కుమార్), కొంతమంది గుండాలు స్టేషన్ కు వస్తారు. కొంతమంది రౌడీలు స్టేషన్ బయటే కాపలా ఉంటారు. వీళ్ళందర్నీ తప్పించుకొని ఆ ఇద్దరి శవాలని అర్జున్ ఎలా మాయం చేసాడు? అసలు వాళ్ళు ఎలా చనిపోయారు? అర్జున్ పోలీసులను ఎలా కాపాడాడు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు :
కిచ్చ సుదీప్ యాక్షన్ రోల్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. స్టేషన్ లో పోలీసుల పాత్రల్లో చేసిన వారంతా కూడా బాగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ లేడీ పోలీస్ పాత్రలో మెప్పించింది. సునీల్ నెగిటివ్ షేడ్స్ లో చేసినా పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు ఆ పాత్రకు. తమిళ్ కమెడియన్ రెడీన్ కింగ్స్లీ కాస్త నవ్వించాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
విశ్లేషణ :
ఈ కథ అంతా ఒక రాత్రిలో జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ హీరో ఎంట్రీ, ఆ ఇద్దరు కుర్రాళ్లను పట్టుకోవడం, వాళ్ళు చనిపోవడం, పోలీసుల మీదకు రౌడీలు రావడం, పోలీసులు ఆ శవాలను దాయాలని ప్రయత్నించడం సాగుతుంది. ఫస్ట్ హాఫ్ కాస్త బోర్ కొట్టినా ప్రీ ఇంటర్వెల్ నుంచి ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ కి ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ ఆ శవాలు రౌడీలకు, వాళ్ళ మనుషులకు దొరక్కుండా పోలీసులు చేసే ప్రయత్నం సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ లో ఇంకో ట్విస్ట్, క్లైమాక్స్ లో మరో ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను థ్రిల్ చేస్తారు. సినిమా అంతా ఒక్క రాత్రిలో ఆల్మోస్ట్ సింగిల్ పోలీస్ స్టేషన్ లొకేషన్ లో జరుగుతుంది. సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయి. అయితే సినిమాకు మ్యాక్స్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు, హీరోని మ్యాక్స్ అని ఎందుకు అంటారు, హీరో బ్యాక్ స్టోరీ ఏంటి అనేది మాత్రం చెప్పలేదు.
టెక్నికల్ అంశాలు :
కథ అంతా రాత్రి పూటే జరుగుతుంది. దానికి తగ్గట్టు విజువల్స్ బాగున్నాయి. మ్యూజిక్ చాలా మైనస్. తమన్ ని మించి డప్పులు కొట్టినట్టు హెవీ సౌండ్ తో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. యాక్షన్ సీక్వెన్స్ లు కొన్ని ఓవర్ గా అనిపిస్తాయి. ఒకే లొకేషన్ లో సింగిల్ సెట్ తో, కొన్ని ఓపెన్ లొకేషన్స్ లో బాగానే తీశారు. తక్కువ మంది క్యారెక్టర్స్, తక్కువ లొకేషన్స్ కాబ్బటి సింపుల్ బడ్జెట్ లోనే సినిమాని పూర్తి చేసి ఉంటారు.
ప్లస్ లు :
కిచ్చ సుదీప్
సస్పెన్స్ స్క్రీన్ ప్లే
లొకేషన్స్
స్టేషన్ లో పోలీస్ పాత్రల్లో చేసిన నటీనటులు
మైనస్ లు :
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
సునీల్ ఆ క్యారెక్టర్ కి సెట్ అవ్వకపోవడం
రేటింగ్ : 3/5
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
Also Read : Sonu Sood : పిలిచి సీఎం పోస్టును ఇస్తామంటే.. వద్దని చెప్పాను : సోనూ సూద్