Kingston : కింగ్‌స్టన్ మూవీ రివ్యూ..
- By News Desk Published Date - 03:40 PM, Fri - 7 March 25

Kingston : జీవి ప్రకాష్ హీరోగా, దివ్యభారతి హీరోయిన్ గా తెరకెక్కించిన తమిళ్ సినిమా ‘కింగ్‌స్టన్’. పేర్లల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్ పై GV ప్రకాష్ సొంత నిర్మాణంలో కమల్ ప్రకాష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళ్ లో తెరకెక్కిన కింగ్ స్టన్ సినిమా డబ్బింగ్ తో తెలుగులో కూడా నేడు మార్చ్ 7న రిలీజయింది.
కథ :
సముద్ర తీరంలోని ఓ గ్రామంలో 1982లో బోసయ్య(అజగన్ పెరుమాళ్) అనే వ్యక్తిని ఊరంతా కలిసి చంపేసి పాతి పెడతారు. అతను ఆత్మగా మారాడని తెలిసి ఆ శవాన్ని సముద్రంలో పడేస్తారు. దీంతో సముద్రంలోకి ఎవరు వెళ్లినా చనిపోతుండటంతో ఆ ఊళ్ళో చేపల వేట నిషేధించి, సముద్రంలోకి ఎవరూ వెళ్లొద్దు అని కంచె వేస్తారు. 2025 నాటికి ఆ ఊరి వాళ్లంతా వేరే ఊర్లో థామస్ అనే వ్యక్తి దగ్గర ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. కింగ్ స్టన్(జీవి ప్రకాష్ కుమార్) థామస్(సాబుమాన్ అబ్దుసమద్) వద్ద పని చేస్తుంటాడు. థామస్ చెప్పినట్టు శ్రీలంక బోర్డర్ కి వెళ్లి సముద్రంలో అక్రమంగా ఏదో తరలిస్తూ ఉంటారు కింగ్ స్టన్, అతని ఫ్రెండ్స్. ఓ రోజు నేవీ అధికారులు వీళ్లపై అటాక్ చేయడంతో ఒక పిల్లాడు చనిపోతాడు. దీంతో థామస్ వాళ్ళతో డ్రగ్స్ సరఫరా చేయిస్తున్నాడని తెలిసి కింగ్ స్టన్ అతనికి ఎదురుతిరుగుతాడు. తమ ఊరి సముద్రాన్ని మూసివేయడం వల్లే మనకు పనిలేదు అని భావించి మూసేసిన సముద్రంలోకి వేటకు వెళ్లి చేపలు పట్టుకొస్తే ఊరి వాళ్ళు ఆత్మలు, దయ్యాలు లేవని నమ్ముతారని కింగ్ స్టన్ అతని స్నేహితులు సముద్రంలోకి వెళ్తారు. థామస్ ని కూడా తీసుకెళ్తారు. కింగ్ స్టన్ గర్ల్ ఫ్రెండ్ రోజ్(దివ్య భారతి)కూడా వెళ్తుంది. కింగ్‌స్టన్, ఆ షిప్ లో ఉన్నవాళ్ళంతా సముద్రంలోకి వెళ్ళాక ఏం జరిగింది? సముద్రంలో ఏం కనపడింది? సముద్రంలో దయ్యాలు, ఆత్మలు ఉన్నాయా? సముద్రంలోకి వెళ్లి తిరిగి వచ్చారా? సముద్రంలోకి వెళ్లిన వాళ్లంతా ఎందుకు చనిపోతున్నారు? 1982లో ఏం జరిగింది? థామస్ ని ఎందుకు సముద్రంలోకి తీసుకెళ్లారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
నటీనటులు :
జీవి ప్రకాష్ కుమార్ విలేజ్ మాస్ కుర్రాడిగా, ధైర్యంగా సముద్రంలోకి వెళ్లే పాత్రలో బాగా మెప్పించాడు. దివ్యభారతి కూడా విలేజ్ అమ్మాయి పాత్రలో సింపుల్ గా నటించింది. చేతన్ కాదంబి, అజగన్ పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమాన్ అబ్దుసమద్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
విశ్లేషణ :
ఫస్ట్ హాఫ్ లో ఒక ఊరిలో 1982లో జరిగిన సంఘటన చూపించి ఆ ఊర్లో ఏదో జరుగుతుంది అని భయపెడతారు. ఆ తర్వాత హీరో పాత్ర, హీరో చేసే పని, హీరో లవ్ స్టోరీతో కాస్త సాగదీస్తారు. హీరో సముద్రం మీదకు వెళదామని ఫిక్స్ అవ్వడంతో ఇంటర్వెల్ కి నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండాఫ్ అంతా సముద్రంలో వీళ్ళు చూసిన భయం, అక్కడ ఆత్మలు, దయ్యలతో సాగుతుంది. క్లైమాక్స్ లో ట్విస్ట్ లు బాగుంటాయి. సినిమాలో 1982కి, 2009కి, 2025 కి కథ తిరుగుతూ ఉండటంతో కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కాస్త నిదానంగా సాగుతుంది. అంతా తమిళ్ బ్యాక్ డ్రాప్ తోనే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం సముద్రంలో అడ్వెంచర్ గా థ్రిల్లింగ్గా భయపెడుతూ ఆసక్తిగా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్స్ కూడా మరింత ఆసక్తిగా ఉంటాయి. ఇది జీవి ప్రకాష్ కి నటుడిగా 25వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే మ్యూజిక్ డైరెక్టర్ గా సంగీతం ఇచ్చి, నిర్మాతగా కూడా పర్ఫెక్ట్ గా తెరకెక్కించాడు జీవి ప్రకాష్.
సాంకేతిక అంశాలు :
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఓ కొత్త పాయింట్ ని కొత్త కథనంతో చూపిస్తూ భయపెట్టాడు దర్శకుడు. పాటలు అంతగా బాగోకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. గ్రాఫిక్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. సముద్రంలో వచ్చే సీన్స్ అన్ని చాలా బాగా డిజైన్ చేసారు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
సినిమా ప్లస్ లు :
సెకండ్ హాఫ్ సముద్రంలో సీన్స్
గ్రాఫిక్స్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ లు :
ఫస్ట్ హాఫ్ ల్యాగ్
సాంగ్స్
రేటింగ్ : 2.75/ 5