Rajasthan Wedding: కదన రంగంలో పెళ్లి భాజాలు.. రాజస్థాన్ లో వెరైటీ పెళ్లి…
రాజస్థాన్ సరిహద్దు జిల్లాల్లో బ్లాక్‌అవుట్ – వైమానిక దాడుల సందర్బంగా విద్యుత్ నిలిపివేత. జోధ్‌పూర్ పావ్టాలో సెల్‌ఫోన్‌ల వెలుగులో వివాహ వేడుక..
- By Kode Mohan Sai Published Date - 05:44 PM, Mon - 12 May 25

Rajasthan Wedding: దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొన్ని సందర్భాల్లో సాధారణ ప్రజల జీవనంపై అనూహ్య ప్రభావం చూపుతుంటాయి. ఇటువంటి ఒక సంఘటన ఇటీవల రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్త చర్యగా సరిహద్దు జిల్లాల్లో గురువారం ( 08-05-2025) రాత్రి విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. వైమానిక దాడుల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల రక్షణ కోసం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అదే సమయంలో జోధ్‌పూర్‌లోని పావ్టా ప్రాంతంలో ఓ వివాహ వేడుక జరుగుతుండగా, ముఖ్యమైన సప్తపది ఘట్టానికి సమయం వచ్చినప్పుడు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అకస్మాత్తుగా వెలుతురు లేకుండా పోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నా, పెళ్లి సభలోని అతిథులు చురుకుగా స్పందించి తాము మొబైల్ ఫోన్‌ల లైట్లను ఆన్ చేసి వధూవరుల ఏడడుగుల కార్యక్రమాన్ని పూర్తి చేయించారు. తర్వాత పురోహితుడు కూడా అదే మొబైల్ వెలుగుల్లో మంత్రోచ్ఛారణ చేస్తూ మిగతా వివాహ కార్యాచరణను నిర్వహించారు.
ఈ సందర్భంలో వరుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ – “వివాహం కంటే దేశ భద్రత మాకు అత్యంత ప్రాముఖ్యమైనది. క్లిష్ట పరిస్థితుల్లోనూ అధికారుల సూచనలను గౌరవిస్తూ వివాహ వేడుకను నిర్వహించుకోవడం వల్ల మన పౌర బాధ్యతను చాటిచెబుతున్నాం,” అని తెలిపారు. ఈ సంఘటన దేశ భద్రత పట్ల సామాన్య పౌరులలో ఉన్న చైతన్యాన్ని, సహకార భావనను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.