Rs 5 Reward : ముగ్గురు నేరగాళ్ల తలపై రూ.5 రివార్డు.. పోలీసుల సంచలన ప్రకటన
ఈ గొడవల్లో ముగ్గురు యువకులు(Rs 5 Reward) తుపాకులతో హల్‌చల్ చేశారు.
- By Pasha Published Date - 02:49 PM, Wed - 23 October 24

Rs 5 Reward : పరారీలో ఉన్న నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసుశాఖ రివార్డులు ప్రకటిస్తుంటుంది. సాధారణంగా ఈ రివార్డులు రూ.వేల నుంచి రూ.కోట్ల దాకా ఉంటాయి. అయితే ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లా పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులపై కేవలం రూ.5 రివార్డును ప్రకటించారు. వాళ్ల ఫొటోలతో పాటు రూ.5 రివార్డును హైలైట్ చేస్తూ పోస్టర్లను తయారు చేయించి.. వారిపై ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో గోడలకు అతికించారు. తద్వారా ఆ ముగ్గురు నిందితుల గురించి భయపడాల్సిన అవసరం లేదనే సందేశాన్ని ప్రజల్లోకి పంపుతున్నట్లు ఉధమ్ సింగ్ నగర్ జిల్లా పోలీసులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు నిందితులు ఏం చేశారో తెలుసుకుందాం..
Also Read :Jio Insurance : బజాజ్‌కు షాక్.. ‘అలయంజ్’తో కలిసి ‘జియో ఇన్సూరెన్స్’ వ్యాపారం
ఉత్తరాఖండ్‌లోని జఫర్‌పూర్ గ్రామంలో అక్టోబర్ 12న హింసాకాండ చెలరేగింది. రెండు గ్రూపులకు చెందిన ప్రజలు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. ఈక్రమంలో తుపాకీ కాల్పుల మోతతో గ్రామం దద్దరిల్లింది. ఈ గొడవల్లో ముగ్గురు యువకులు(Rs 5 Reward) తుపాకులతో హల్‌చల్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన సహబ్ సింగ్, రుద్రపూర్‌కు చెందిన జస్వీర్ సింగ్, దినేష్‌పూర్‌కు చెందిన మన్మోహన్ సింగ్‌లు కాల్పులు జరిపారు. దీంతో జఫర్‌పూర్ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘర్షణలు ముగిసిన వెంటనే వారు ముగ్గురు పరారయ్యారు. వారి లొకేషన్‌ను ట్రాక్ చేసే ప్రయత్నాల్లో ఉధమ్ సింగ్ నగర్ జిల్లా పోలీసులు ఉన్నారు. ఈక్రమంలోనే ఆ ముగ్గురు నిందితుల ఆచూకీని తెలిపే వారికి రూ.5 చొప్పున రివార్డు ఇస్తామని ప్రకటించారు. వారిని పోలీసుశాఖ ఎంత చులకనగా చూస్తోందో ప్రజలందరికీ తెలపాలనే ఉద్దేశంతోనే రివార్డు మొత్తాన్ని తగ్గించామని జిల్లా పోలీసు విభాగం ఉన్నతాధికారులు తెలిపారు.
Also Read :WhatsApp : వాట్సాప్ లింక్డ్ డివైజ్‌లలో ఇక సరికొత్త ఫీచర్
ఇంత తక్కువ రివార్డు ఉంది కదా అని.. ఆ ముగ్గురు నిందితుల వల్ల జఫర్‌పూర్ గ్రామంలో తక్కువ నష్టమే జరిగి ఉండొచ్చని అనుకుంటే తప్పులో కాలేసినట్టే. వాస్తవానికి ఆ ఊరిలో జరిగిన గొడవల్లో దాదాపు 40 బుల్లెట్లు పేలాయి. వాటి వల్ల 8 మంది గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. బుల్లెట్లు ఏవైనా సున్నిత భాగాల్లో తాకి ఉంటే.. ఎంతోమంది ప్రాణాలు పోయి ఉండేవి. ఇంత తీవ్ర నేరం చేసిన తక్కువ రివార్డును ప్రకటించడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన సదరు నిందితులకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు అందించాలంటే.. పోలీసులు రివార్డు అమౌంటును పెంచాలని సూచిస్తున్నారు.