Swimmer Rescued : బీచులో మునిగింది.. 80 కి.మీ దూరంలో ప్రాణాలతో తేలింది
భూమిపై నూకలు మిగిలి ఉంటే.. ఎవరు ఏం చేసినా.. ఎంతటి విపత్తు ఎదురైనా.. ఏమీ కాదని పెద్దలు చెబుతుంటారు.
- By Pasha Published Date - 03:20 PM, Thu - 11 July 24

Swimmer Rescued : భూమిపై నూకలు మిగిలి ఉంటే.. ఎవరు ఏం చేసినా.. ఎంతటి విపత్తు ఎదురైనా.. ఏమీ కాదని పెద్దలు చెబుతుంటారు. అది నిజమే అని తాజాగా ఓ ఘటనతో తేలింది. ఈ ఘటనకు జపాన్‌లోని షిమోడా నగర బీచ్ సాక్ష్యంగా నిలిచింది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
చైనాకు చెందిన 20 ఏళ్ల యువతి టూర్ కోసం జపాన్‌కు వచ్చింది. టూర్‌లో భాగంగా ఆమె చాలా జపాన్ నగరాల్లో పర్యటించింది. చివరకు గత సోమవారం రోజు షిమోడా నగరానికి వచ్చింది. అక్కడి అందమైన బీచ్‌కు చేరుకుంది. స్విమ్మింగ్ రింగు ధరించి ఈత కొట్టేందుకు బీచ్‌లోని సముద్ర జలాల్లోకి దూకింది. కాసేపు ఆమె సేఫ్‌గానే ఈతకొట్టింది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆటుపోట్లు బీచ్‌ను ముంచెత్తాయి. ఆ సముద్ర ఆటుపోట్లలో ఆ చైనీస్ యువతి కొట్టుకుపోయింది. అనంతరం అక్కడే ఆమె ఫ్రెండ్ ఒకరు జపాన్ కోస్ట్ గార్డ్ దళానికి కాల్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. ఎలాగైనా తన స్నేహితురాలిని రక్షించాలని కోరింది. దీంతో జపాన్(Japan) కోస్ట్ గార్డ్ దళాలు రెస్క్యూ(Swimmer Rescued) ఆపరేషన్‌ను మొదలుపెట్టాయి. ఆ మార్గంలో రాకపోకలు సాగించే అన్ని నౌకలను అలర్ట్ చేశాయి.
Also Read :Anant Ambani : అనంత్ అంబానీ గ్రాండ్ మ్యారేజ్ రేపే.. తరలిరానున్న అతిరథ మహారథులు
కట్ చేస్తే.. సోమవారం రాత్రి షిమోడా బీచ్‌లో గల్లంతైన సదరు యువతి 37 గంటల తర్వాత 80 కిలోమీటర్ల దూరంలోని బోసో ద్వీపకల్పపు దక్షిణపు కొనలోని సముద్ర జలాల్లో కనిపించింది. స్విమ్మింగ్ రింగు ఆమె ప్రాణాలను కాపాడింది. స్విమ్మింగ్ రింగ్ ధరించి ఉండటంతో ఆమె సముద్ర జలాల్లో తేలియాడింది. అయితే ఆమె స్పృహలో లేదు. బుధవారం తెల్లవారుజామున ఓ కార్గోషిప్ డ్రైవర్లు ఆమెను సముద్రంలో గుర్తించారు. అటువైపుగా వెళ్తున్న ఓ ఎల్పీజీ ట్యాంకర్ షిప్‌కు సమాచారాన్ని అందించారు. ఆ షిప్పులోని ఇద్దరు సిబ్బంది సముద్రంలోకి దూకి ఆ యువతిని రక్షించారు. అనంతరం జపాన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టరును పంపించి.. ఆమెను ఆస్పత్రిలో చేర్పించింది. సాధారణ చికిత్సలో ఆ చైనీస్ యువతి కోలుకుంది. వెంటనే ఆస్పత్రి నుంచి వెళ్లిపోయింది. సముద్రంలో గంటల కొద్దీ తేలియాడినా.. నేరుగా మండుటెండ బారినపడినా ఆమెకు ఏమీ కాలేదు.