World’s Oldest Whiskey: వందల ఏళ్ల క్రితం నాటి విస్కీ ఇది.. ధరెంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
స్కాట్లాండ్ లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన విస్కీని కనుగొన్నారు. 1833లో దీనిని తయారుచేసి నిల్వ చేసినట్లు చెబుతున్నారు. దాదాపు రెండు డజన్లు..
- By News Desk Published Date - 08:34 PM, Thu - 4 January 24

World’s Oldest Whiskey: మామూలుగానే విస్కీ తాగితే ఆ కిక్కే వేరు. అది వందల ఏళ్ల క్రితం నిల్వచేసిన విస్కీ అయితే ఇంకెంత కిక్కుంటుంది. ఈ విషయం మందుబాబులకు మాత్రమే అర్థమవుతుంది. తాజాగా స్కాట్లాండ్ లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన విస్కీని కనుగొన్నారు. 1833లో దీనిని తయారుచేసి నిల్వ చేసినట్లు చెబుతున్నారు. దాదాపు రెండు డజన్లు.. అంటే 24 బాటిళ్లను వేలానికి ఉంచుతున్నారు. ఒక్కో బాటిల్ ఖరీదెంతో తెలుసా ? అక్షరాలా 10 లక్షల రూపాయలు. వాటి ధర అంత ఉండటానికి కారణం అవి ప్రాచీనమైనవి కావడమే. అయితే వాటిని ఏయే పదార్థాలతో తయారు చేశారన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
కార్బన్ డేటింగ్ ప్రకారం ఈ విస్కీలు తయారైంది 1830లో అయి ఉంటుందని.. 1841లో వాటిని బాటిల్ లో వేసి భద్రపరిచి ఉంటారని తెలుస్తోంది. పురాతన తవ్వకాల్లో ఈ స్కాచ్ విస్కీ బాటిల్స్ బయటపడ్డాయి. ఈ పురాతన స్కాచ్ విస్కీ బాటిల్స్ స్కాట్లాండ్ లోని బ్లెయిర్ కోటలో లభించాయి. ఆ కోటలో 7 శతాబ్దాలకు పైగా అథోల్ కుటుంబానికి చెందిన పూర్వీకులు నివసించేవారట. ఈ విస్కీలు వారు తాగేందుకు చేసుకున్నవే అని భావిస్తున్నారు.
1844లో విక్టోరియా రాణి ఈ బ్లెయిర్ కోటను చూసేందుకు వచ్చిన సమయంలో ఆమెకు అనేక విస్కీ బాటిళ్లను బహుమతులుగా ఇచ్చినట్లు సమాచారం. విస్కీని నిల్వ చేసే పద్ధతిని ఫెర్మెంటేషన్ అంటారు. చూడటానికి బెల్లంనీళ్లు, పలుచటి తేనె కలిపిన గోల్డెన్ వాటర్ లా కనిపిస్తుంది. దీనిని చెక్కపీపాలో, ఓక్ చెట్లతో తయారు చేసిన పీపాల్లో నిల్వ చేస్తారు. విస్కీ టేస్టీగా ఉండాలంటే కనీసం 10-18 ఏళ్ల వరకూ నిల్వ చేయాలి. 1926లో తయారు చేసిన విస్కీని 2019లో వేలం వేయగా.. ఆ బాటిల్ ధర రూ.12 కోట్లకు పైగానే పలికింది.