Winter: చలికాలంలో చల్లనీరు లేదా వేడినీరు ఏ నీటితో స్నానం చేస్తే మంచిదో మీకు తెలుసా?
Winter: చలికాలంలో చల్లనీరు లేదా వేడి నీరు ఈ రెండింటిలో ఏ నీటితో స్నానం చేస్తే మంచిది, దేనివల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:00 AM, Fri - 14 November 25
Winter: చలికాలంలో వచ్చింది అంటే చాలు ఉదయం 8 లేదా 9 వరకు ఇంట్లో నుంచి బయటకు రావాలి అంటేనే కాస్త ఆలోచిస్తూ ఉంటారు. ప్రస్తుతం చలికాలం కావడంతో చలి తీవ్రత పెరుగుతోంది. రోజు రోజుకి చలి పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. అయితే చలికాలం వచ్చింది అంటే వేడి నీటి వినియోగం పెరుగుతూ ఉంటుంది. ఉదయాన్నే ముఖం శుభ్రం చేసుకునే నుంచి స్నానం చేసే వరకు ప్రతి ఒక్క దానికి వేడి నీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొందరు చలికాలంలో కూడా చల్లనీటితో స్నానం చేస్తూ ఉంటారు. ఇంకొందరు వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు.
అయితే చలికాలంలో చల్ల నీటితో స్నానం చేయడం మంచిదా లేక వేడి నీటితో స్నానం చేయడం మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తే హాయిగా అనిపిస్తుంది. వేడి నీరు చర్మంపై రంధ్రాలను తెరిచి, దుమ్ము, చెమటను శుభ్రం చేస్తుంది. అదే విధంగా రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుందట. రోజంతా పని చేసి అలసిపోయినప్పుడు వేడి నీళ్ల స్నానం శరీరాన్ని, మనసును రిలాక్స్ చేస్తుందట. చలి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే ఎక్కువ వేడిగా ఉన్న నీటితో తరచుగా స్నానం చేయడం చర్మానికి హానికరం కావచ్చట.
ఎందుకంటే వేడి నీరు చర్మంలోని సహజ నూనెను తొలగిస్తుందట. దాంతో చర్మం పొడిబారి దురద, దద్దుర్లు రావచ్చని చెబుతున్నారు. ప్రత్యేకంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఎక్కువ వేడి నీరు వాడకూడదట. చలికాలంలో చన్నీళ్ల స్నానం అనగానే చాలామంది వణికిపోతూ ఉంటారు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ వేగవంతమవుతుందట. శరీరంలోని అవయవాలు ఉత్తేజితమవుతాయని, రోగనిరోధక శక్తి కూడా బలపడుతుందని చెబుతున్నారు. అంతేకాదు చన్నీటి స్నానం అలసటను, కండరాల ఇన్‌ఫ్లమేషన్ ను తగ్గిస్తుందట. చల్లటి నీరు మనసు, మెదడుపై సానుకూల ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.
వేడి నీటితో స్నానం అందరికీ సరిపోదు. అలాగే చల్లటి నీటితో స్నానం కూడా అందరికీ సరిపోదు.
జలుబు, ఆస్తమా, సైనస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు చల్లటి నీటితో స్నానం చేయకూడదట. వేడి నీరు వారికి సౌకర్యంగా ఉంటుందని, అలాగే హై బీపీ, మైగ్రేన్, స్కిన్ డ్రైనెస్ ఉన్నవారు చల్లటి లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదని చెబుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం అని చెబుతున్నారు. ఎలాంటి నీటితో స్నానం చేసినా స్నానం తర్వాత వెంటనే చర్మాన్ని మెత్తటి టవల్ తో తుడుచుకోవాలట. అలాగే మాయిశ్చరైజర్ వాడడం తప్పనిసరి. చల్లటి గాలిలో చర్మం త్వరగా డ్రై అవుతుంది. కాబట్టి ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె లేదా బాడీ లోషన్ వాడాలని చెబుతున్నారు.