Yellow Teeth: పసుపు దంతాలకు అసలు కారణం ఇదే.. ఇలా చేస్తే మెరిసిపోవాల్సిందే
- Author : Vamsi Chowdary Korata
Date : 10-06-2026 - 11:11 IST
Published By : Hashtagu Telugu Desk
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, టీ కాఫీలు తీసుకోవడం వంటివి మన దంతాలపై ప్రభావం చూపుతుంటాయి. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతుంటాయి. ఇవి మన అందాన్ని తగ్గించడమే కాకుండా ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తాయి. నలుగురి ముందు నవ్వడానికి వెనక్కి తగ్గేలా చేస్తాయి. అయితే ఇందుకోసం మనం వేల వేలు ఖర్చు చేయాల్సిన పనిలేదు. మన వంటింట్లో ఉండే పదార్థాలతో, మన అలవాట్లు మార్చుకోవడంతో పసుపు పళ్లను తెల్లగా మార్చుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం..
మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత అందంగా తయారైనా మన ముఖం మీద చిరునవ్వు లేకపోతే ఆ లుక్ అసంపూర్ణంగా అనిపిస్తుంది. ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు హ్యాపీగా నవ్వాలన్నా, ఫ్రెండ్స్‌తో సెల్ఫీ దిగాలన్నా చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. కారణం పళ్లు పచ్చగా, గార పట్టి ఉండటం. దంతాలు పసుపు రంగులో లేదా గార పట్టి ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వారికే తెలుస్తుంది. దీంతో చాలా మంది నలుగురిలో కలిసేందుకు వెనకడుగు వేస్తుంటారు.
ఆత్మన్యూనతా భావంతో ఉంటారు. అయితే మనం నిత్యం పాటించే చిన్న చిన్న ఇంటి చిట్కాలు మన దంతాల రంగును పూర్తిగా మార్చేయగలవు అని NLM అధ్యయనం పేర్కొంది. ఈ నేపథ్యంలో పెద్దగా ఖర్చు లేకుండా వంటగదిలో ఉండే చిన్న చిన్న పదార్థాలతోనే పచ్చగా ఉన్న దంతాలను తెల్లగా మార్చుకుని, మీ స్మైల్‌ని రీఫ్రెష్ చేసే చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
పసుపు దంతాలను తెల్లగా మార్చడానికి బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుందట. కొంచెం బేకింగ్ సోడా తీసుకుని అందులో కొన్ని చుక్కల నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. వంటసోడాకు నీళ్ల బదులు కొన్ని చుక్కల నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఆ పేస్ట్‌ను రెగ్యులర్‌గా వాడే టూత్పేస్ట్పై వేసుకుని ఆ మిశ్రమంతో పళ్లు తోముకోవాలి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై ఉండే పాచి, పసుపు రంగుతో పాటు గార పట్టినా కూడా పోతుందట. దీంతో దంతాలు తెల్లగా మారుతాయి.
కొంచెం పసుపు తీసుకుని కొన్ని చుక్కల నిమ్మరసం లేదా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని టూత్ బ్రష్‌తో పళ్లపై రాసుకుని తోముకోవాలి. కొంతమంది పసుపుకి నీళ్లు లేదా నిమ్మరసానికి బదులుగా కొబ్బరినూనె ఉపయోగిస్తారు. ఈ మిశ్రమాన్ని వారంలో రెండు రోజులు వాడటం వల్ల దంతాలపై ఉండే పసుపుదనం, పాచి, గార పోతాయి. అలాగే పసుపు, నిమ్మరసం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.
ఇక పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడాన్ని సైతం తగ్గిస్తాయట. నిమ్మరసం ఎక్కువ ఉపయోగించడం వల్ల పళ్ల పైన ఉండే ఎనామిల్‌ని హరించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీనిని నిపుణుల సలహాతో చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి.
మనం నిత్యం ఆహార పదార్థాల్లో వేసుకునే ఉప్పుతో కూడా పళ్లపై పేరుకుపోయిన పాచిని తొలగించి, పళ్లను తెల్లగా చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం రాతి ఉప్పును ఉపయోగించాలి. రాతి ఉప్పును మెత్తని చూర్ణంలా చేసుకోవాలి. దీనితో బ్రష్ చేసుకోవడం వల్ల పళ్లపై పేరుకుపోయిన పాచి, మురికి తొలగిపోతాయి. పచ్చగా ఉండే పళ్లు తెల్లగా అవుతాయి మరియు నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. అయితే ఉప్పుతో పళ్లను గట్టిగా రుద్దడం వల్ల పళ్ల పైన ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. కాబట్టి దీనిని చాలా సున్నితంగా, జాగ్రత్తగా ఉపయోగించాలి.
నిమ్మరసం, బేకింగ్ సోడా మిశ్రమం కూడా పసుపు పళ్లను తెల్లగా మార్చడానికి ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమంతో దంతాలను తోముకోవచ్చు. దీనివల్ల దంత సమస్యలు తగ్గుతాయి. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ కూడా మంచి రెమెడీగా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి బాగా పుక్కిలించాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, నిమ్మరసం బాగా ఎసిడిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీనిని ఎక్కువ ఉపయోగించడం వల్ల పళ్ల పైన ఉండే ఎనామిల్‌ను హరించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీనిని చాలా జాగ్రత్తగా, నిపుణుల సలహాతో ఉపయోగించాలి.
ఇది యాంటీ బాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీనితో నోటి దుర్వాసన, చెడు శ్వాస కూడా తగ్గుతాయి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె తీసుకుని, దానిని నోట్లో పోసుకుని సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు నోటి మూలలన్నిటికీ తిప్పుతూ బాగా పుక్కిలిస్తూ ఆయిల్ పుల్లింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా నోటిలోని చెడు బ్యాక్టీరియా నశించి, నోటి దుర్వాసన తగ్గుతుంది.
వీటిని పాటించే ముందు మితమే హితం అని గ్రహించండి. అలాగే పైన తెలిపిన చిట్కాల కంటే ముఖ్యంగా కాఫీ, టీ, ఆల్కహాల్, సిగరెట్లు, గుట్కాలు మానేయాలి. సిగరెట్లలోని నికోటిన్ వల్ల దంతాలు పచ్చగా మారుతాయి. ముఖ్యంగా కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల కూడా దంతాల రంగు మారుతుంది.
వీటిని వీలైనంత వరకు మానేయాలి.. ఒకవేళ మానేయలేకపోతే స్ట్రాతో తాగాలి. అలాగే నాలుకపై ఉండే బ్యాక్టీరియా దంతాలపై ప్రభావం చూపుతుంది కాబట్టి టంగ్ క్లీనర్‌తో నాలుకను క్లీన్ చేసుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యంగా అప్పుడప్పుడు దంత వైద్యులను సంప్రదించాలి.