Pregnancy Stages : గర్భధారణ నుంచి బిడ్డ పుట్టే వరకు జరిగే అద్భుతమైన ప్రయాణం..ఈ మూడు ముఖ్యమైన దశలు మీకు తెలుసా?
కానీ కొందరు మాత్రం వీర్యం ఉంటే చాలు, బిడ్డ పుడుతుంది అనే అపోహలో ఉంటారు. ఇది పూర్తిగా తప్పు. ఆరోగ్యవంతమైన శిశువు ఏర్పడేందుకు ఇద్దరి శరీరాలు ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు గర్భధారణ నుండి పుట్టుక వరకూ జరిగే ప్రక్రియను వివరంగా తెలుసుకుందాం.
- By Latha Suma Published Date - 06:00 PM, Mon - 14 July 25
Pregnancy Stages : గర్భధారణ అంటే కేవలం పురుషుడి వీర్యంతోనే జరిగే ప్రక్రియ కాదని భావించాలి. అలాగే ఇది కేవలం మహిళ శక్తితోనూ జరగదు. పురుషుడు, మహిళ ఇద్దరి జీవకణాల సమన్వయం వల్లే ఒక జీవం ఆవిర్భవిస్తుంది. అయితే, గర్భాన్ని మహిళ తన శరీరంలో మోస్తుందనే కారణంగా తల్లికి ఎక్కువ గౌరవం లభిస్తుంది. కానీ కొందరు మాత్రం వీర్యం ఉంటే చాలు, బిడ్డ పుడుతుంది అనే అపోహలో ఉంటారు. ఇది పూర్తిగా తప్పు. ఆరోగ్యవంతమైన శిశువు ఏర్పడేందుకు ఇద్దరి శరీరాలు ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు గర్భధారణ నుండి పుట్టుక వరకూ జరిగే ప్రక్రియను వివరంగా తెలుసుకుందాం.
గర్భధారణ నుంచి బిడ్డ పుట్టే వరకు జరిగే ఈ అద్భుతమైన ప్రయాణాన్ని నిపుణులు మూడు ముఖ్యమైన దశలుగా విభజించారు.
1. జెర్మినల్ దశ (Germinal Stage)
ఈ దశ గర్భధారణ అనంతరం మొదటి రెండు వారాలు కొనసాగుతుంది. పురుషుడి వీర్యం, స్త్రీ అండంతో కలిసినప్పుడు జైగోట్ (Zygote) ఏర్పడుతుంది. ఇది గర్భాశయం వైపు ప్రయాణిస్తూ అనేకసార్లు విడిపోయి బ్లాస్టోసిస్ట్ (Blastocyst) అనే రూపాన్ని దాలుస్తుంది. ఇది గర్భాశయ గోడకు అతుక్కునే ప్రక్రియను ఇంప్లాంటేషన్ అంటారు. ఈ దశ విజయవంతంగా పూర్తైతే గర్భధారణ అంగీకరించబడుతుంది. అదే సమయంలో శరీరంలో గర్భానికి అవసరమైన హార్మోన్ల ఉత్పత్తి ప్రారంభమవుతుంది.
2. ఎంబ్రియానిక్ దశ (Embryonic Stage)
ఇది మూడవ వారం నుండి ఎనిమిదవ వారం వరకూ కొనసాగుతుంది. ఈ దశలో బ్లాస్టోసిస్ట్ పిండంగా మారుతుంది. శరీరంలోని ముఖ్యమైన అవయవాలు—మెదడు, గుండె, కళ్లు, చేతులు, కాళ్లు మొదలైనవి రూపుదిద్దుకుంటాయి. గుండె కొట్టుకోవడం మొదలవుతుంది. ఇది చాలా కీలకమైన దశ. ఎందుకంటే ఈ దశలో శిశువు అభివృద్ధికి మూలమైన అన్ని ప్రధాన అవయవాలు ఏర్పడతాయి. చాలామంది మహిళలు ఈ సమయంలో ఉదయం వికారం, అలసట, వాంతులు వంటి శారీరక మార్పులను అనుభవిస్తారు.
3. ఫెటల్ దశ (Fetal Stage)
ఈ దశ తొమ్మిదవ వారం నుంచి పుట్టుక వరకూ కొనసాగుతుంది. ఇది గర్భధారణలో చాలా దశ. ఈ సమయంలో పిండం స్పష్టమైన శిశువుగా మారుతుంది. శరీర అవయవాలన్నీ మెచ్యూర్ అవుతాయి. లింగ నిర్ధారణ జరుగుతుంది. జుట్టు, గోర్లు, వెంట్రుకలు పెరుగుతాయి. బిడ్డ చిన్నపాటి కదలికలు ప్రారంభిస్తుంది కానీ మాతృ గర్భంలో వాటిని 20వ వారం తర్వాతే మహిళలు అనుభవించగలుగుతారు. బిడ్డ బరువు, పరిమాణం వేగంగా పెరుగుతాయి.
డెలివరీ – చివరి దశ
సాధారణంగా గర్భధారణ 37 నుంచి 40 వారాల మధ్య పూర్తవుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో 37 వారాలకుముందే డెలివరీ కావచ్చు. మరికొందరికి 40 వారాలు దాటినా డెలివరీ ఆలస్యమవుతుంది. ఇది పూర్తిగా మహిళ ఆరోగ్యం, జీవనశైలి, బిడ్డ అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నార్మల్ డెలివరీ జరగవచ్చు. మరికొన్ని సందర్భాల్లో సిజేరియన్ అవసరం కావచ్చు. కాగా, గర్భధారణ అనేది ఓ శాస్త్రీయ ప్రక్రియ. ఇందులో ప్రతి దశలో ఎన్నో మార్పులు, అవసరాలు ఉంటాయి. ఇద్దరి శరీరాల భాగస్వామ్యం వల్లే ఒక జీవం పురుడుపోస్తుంది. కాబట్టి దీన్ని అవగాహనతో, శ్రద్ధతో, ప్రేమతో చూడాలి. ప్రతి దశలో శిశువును, తల్లిని సహాయపడేలా, ఆరోగ్యంగా ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి.