Solo Life: సోలో లైఫే సో బెటర్.. అనుకోవడానికి అసలు కారణాలివే..
నూటికి 90 శాతం మందికి తమ జీవిత భాగస్వామి లేదా లవర్ తమకు నచ్చినట్టుగా ఉండాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కొత్తగా పెళ్లిచేసుకునే వారికి ఇవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి.
- Author : News Desk
Date : 03-12-2023 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
Solo Life: కుటుంబ పరిస్థితుల ప్రభావమో, సింగిల్ లైఫ్ అలవాటవ్వడమో, మరొకరుంటే జీవితం ప్రశాంతంగా ఉండదన్న భావన ఉండటమో.. కారణం ఏదైనా కానీ.. నేటి తరంలో చాలా మంది సింగిల్ గా ఉండేందుకే మొగ్గుచూపుతున్నారు. ఎవరైనా ప్రేమ, పెళ్లి ఊసెత్తితే.. అవన్నీ మనకి పడవమ్మా అని డైలాగ్స్ కొడతారు. ఎలాంటి కమిట్ మెంట్స్ లేకుండా సోలో లైఫే బాగుందంటూ.. లైఫ్ ని తమకి నచ్చినట్లు లీడ్ చేస్తుంటారు. ఇలా సోలో లైఫే సో బెటర్ అని ఫీల్ అవ్వడానికి రకరకాల కారణాలుంటాయంటున్నారు మానసిక నిపుణులు.
వాటిలో ఒకటి.. చాలా మంది ఒంటరి జీవితానికి అలవాటు పడటం. ఎలాంటి కమిట్ మెంట్స్, కండీషన్స్ లేకుండా జీవించడానికి అలవాటుపడిన వారు.. సడన్ గా రిస్ట్రిక్షన్స్ పెడితే ఇబ్బందిగా ఫీలవుతుంటారు. సింగిల్ గా ఉన్నప్పుడే జీవితం బాగుందనుకుంటారు.
మరికొందరికి గతంలో మనసుకు, జీవితానికి తగిన గాయాలు నేర్పిన పాఠాలు వారిని కఠినంగా మార్చేస్తాయి. సింగిల్ లైఫ్ బెటర్ అని ఫిక్సయి.. కొత్త ప్రేమను, కొత్త వ్యక్తులను యాక్సెప్ట్ చేయలేరు. రిలేషన్ షిప్ లో మళ్లీ గొడవలే వస్తాయన్న భయంతో అలానే ఉండిపోతారు.
ఇంకొందరికి ప్రేమన్నా, రిలేషన్ షిప్ అన్నా చాలా భయం ఉంటుంది. ఎవ్వరినీ త్వరగా నమ్మలేరు. రొమాంటిక్ లైఫ్ వద్దనుకుంటారు. ప్రేమ, పెళ్లి తర్వాత జీవితంలో చాలా మార్పులు, ఇబ్బందులు వస్తాయని భయపడి సోలోగానే ఉండిపోతున్నారు.
నూటికి 90 శాతం మందికి తమ జీవిత భాగస్వామి లేదా లవర్ తమకు నచ్చినట్టుగా ఉండాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కొత్తగా పెళ్లిచేసుకునే వారికి ఇవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కోరుకున్నవారితో జీవిత ప్రయాణం మొదలయ్యాక తమ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడం, వారికి కావలసిన లక్షణాలు లేకపోవడంతో గొడవలు మొదలై.. అవి విడాకులకు దారితీస్తున్నాయి. చివరికి ఒంటరిగా ఉండటమే మంచిదనుకుని అలానే ఉండిపోతున్నారు.
కానీ.. ఏ వ్యక్తికైనా జీవితాంతం తోడుంటే వ్యక్తి అవసరమని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రేమైనా, పెళ్లైనా గొడవలు, మనస్ఫర్థలు వస్తాయి. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప.. అసలు తోడే వద్ద.. సోలోగానే ఉండిపోతానంటే.. అది మరో మానసిక సమస్య అవుతుందంటున్నారు. సో.. సోలో లైఫ్ నాట్ సో బెటర్.