Benefits of Onion Peels: ఉల్లిపాయపొట్టుతో ఊహించని ప్రయోజనాలు.. ఇకనుంచి దాచి ఇలా చేయండి
ఉల్లిపాయల్ని మొక్కలకు ఎరువుగా వాడొచ్చు. చర్మ సంబంధిత వ్యాధుల్ని తగ్గించే గుణాలుంటాయి. ఉల్లి తొక్కలతో క్లీనింగ్ లిక్విడ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. జుట్టు సంబంధిత సమస్యలకు కూడా ఉల్లితొక్కలు చక్కని పరిష్కారం.
- By News Desk Published Date - 02:00 PM, Thu - 25 July 24

Benefits of Onion Peels: ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదన్న సామెత తెలిసిందే. ప్రతి ఇంటిలో రోజుకొక ఉల్లిపాయనైనా కచ్చితంగా వాడుతారు. ఉల్లిపాయలే కాదు.. దానిపై ఉండే పొట్టు కూడా మంచిదే. తినడానికి కాదండోయ్. మొక్కల నుంచి ముఖ సౌందర్యం, జుట్టు పెరుగుదలకు మంచిది. ఇంటిని శుభ్రం చేసే లిక్విడ్ లో కూడా వాడొచ్చు.
ఉల్లిపాయల్ని మొక్కలకు ఎరువుగా వాడొచ్చు. తొక్కలను నీటిలో వేసి మరిగించుకోవాలి. అవి రంగుమారాక స్టఫ్ ఆఫ్ చేసి.. తొక్కల్ని మాత్రం మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీరుపోసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ఒక స్ప్రే బాటిల్ లో వేసి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొక్కలకు స్ప్రే చేస్తే.. బాగా ఎదుగుతాయి.
ఉల్లిపాయ తొక్కల్లో చర్మ సంబంధిత వ్యాధుల్ని తగ్గించే గుణాలుంటాయి. విటమిన్ ఎ, ఇ, సి పుష్కలం. ముఖంపై ఏర్పడే మరకలు తగ్గాలంటే తొక్కలను నీటిలో 2 గంటలపాటు నానబెట్టుకోవాలి. ఆ నీటిని వడగట్టి.. కొద్దిగా పసుపు, శనగపిండి వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. 15-20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ముఖంపై మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యల్ని తగ్గిస్తుంది. వారానికి రెండుసార్లైనా ఈ మాస్క్ ను వేసుకోవాలి.
ఉల్లి తొక్కలతో క్లీనింగ్ లిక్విడ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఉల్లి తొక్కల్ని నీటిలో మరగబెట్టి.. మెత్తటి పేస్ట్ గా చేసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ డిటర్జెంట్ పౌడర్, టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే క్లీనింగ్ లిక్విడ్ రెడీ. వస్తువులపై పేరుకుపోయిన మురికిని తొలగించడంలో సహాయపడుతుంది.
జుట్టు సంబంధిత సమస్యలకు కూడా ఉల్లితొక్కలు చక్కని పరిష్కారం. మీకు చుండ్రు సమస్య ఎక్కువగా ఉన్నట్లైతే.. ఉల్లి తొక్కల్ని నీటిలో మరిగించి వడకట్టుకోవాలి. ఆ నీరు చల్లారిన తర్వాత తలకు అప్లై చేసి.. మసాజ్ చేసుకోవాలి. షాంపూ లేకుండా కేవలం నీటితోనే జుట్టును కడగాలి. జుట్టు ఎక్కువగా రాలితే.. ఉల్లి తొక్కల్ని మిక్సీలో గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. రెండు టీ స్పూన్ల పొడిలో 2 స్పూన్స్ అలోవెరా జెల్ కలిపి.. దానిని స్కాల్ప్ కు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే చాలు.