Pomegranate : ఈ సమస్యలు ఉన్న వారు దానిమ్మ పండు తినకూడదు
Pomegranate : ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు శరీరానికి శక్తినిస్తాయి. క్రమం తప్పకుండా దానిమ్మను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
- By Sudheer Published Date - 08:00 AM, Sat - 30 August 25

దానిమ్మ పండ్లు (Pomegranate ) రత్నాల్లాంటి గింజలతో రుచికరంగా ఉండడమే కాకుండా, పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు శరీరానికి శక్తినిస్తాయి. క్రమం తప్పకుండా దానిమ్మను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, రక్త ప్రసరణ మెరుగవుతుంది. అయితే ప్రతి ఒక్కరికీ ఈ పండ్లు సూటవు అనుకోవడం పొరపాటు. కొంతమందికి ఇవి ఆరోగ్య సమస్యలను మరింత పెంచే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారికి దానిమ్మ అంతగా ఉపయోగపడకపోవచ్చు. ఇందులో ఉండే టానిన్లు కొన్నిసార్లు పేగు పొరను చికాకుపరుస్తాయి. దీంతో ఉబ్బరం, విరేచనాలు, తిమ్మిరి వంటి సమస్యలు రావచ్చు. ప్రత్యేకంగా ఇర్రిటేబుల్ బోవెల్ సిండ్రోమ్ (IBS) ఉన్నవారికి ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాగే, కొంతమందికి దానిమ్మ తింటే అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. దురద, ముఖం లేదా గొంతు వాపు, చర్మ దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనపడితే వెంటనే ఆపాలి.
మరోవైపు, హైపోటెన్షన్ ఉన్నవారు, హార్ట్ పేషంట్లు లేదా స్టాటిన్స్, బీటా బ్లాకర్స్, యాంటీకోగ్యులెంట్స్ వంటి మందులు వాడుతున్నవారు దానిమ్మ తినడంలో జాగ్రత్తలు పాటించాలి. దానిమ్మలోని కాంపౌండ్లు కాలేయ ఎంజైమ్‌ల పనితీరును ప్రభావితం చేయడంతో మందుల ప్రభావం తగ్గిపోవచ్చు లేదా దుష్ప్రభావాలు పెరుగుతాయి. అంతేకాక, సర్జరీకి ముందు కనీసం రెండు వారాల పాటు దానిమ్మ తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. రక్తం గడ్డకట్టే విధానాన్ని ఇది మార్చడం వల్ల సర్జరీ సమయంలో రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి, దానిమ్మ పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని తప్పుకోవడం అవసరం.