Mutton Rost: డాబా స్టైల్ మటన్ రోస్ట్.. ఇలా చేస్తే ఒక ముక్క కూడా మిగలదు!
మామూలుగా మనం మటన్ తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. మటన్ కర్రీ మటన్ మసాలా కర్రీ మటన్ వేపుడు, మటన్ బిర్యానీ, మటన్
- Author : Anshu
Date : 04-03-2024 - 10:19 IST
Published By : Hashtagu Telugu Desk
మామూలుగా మనం మటన్ తో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. మటన్ కర్రీ మటన్ మసాలా కర్రీ మటన్ వేపుడు, మటన్ బిర్యానీ, మటన్ కబాబ్ ఇలా ఎప్పుడూ ఒకే విధమైన వంటలు తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏదైనా కొత్తగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మటన్ రోస్ట్ తిన్నారా. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
మటన్ – అరకిలో
ఉల్లిపాయ – ఒకటి
టమోటో – ఒకటి
అల్లం – చిన్న ముక్క
వెల్లుల్లి – ఐదు రెబ్బలు
మిరియాల పొడి – అర టీ స్పూన్
కారం – అర టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
ధనియాల పొడి – అర టీ స్పూన్
గరం మసాలా – అర టీ స్పూన్
కరివేపాకులు – రెండు రెమ్మలు
నూనె – సరిపడా
తయారీ విధానం:
ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి పసుపు, మిరియాల పొడి వేసి, ఒక గ్లాసు నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించాలి. అరగంట పాటు ఉడికిస్తే మెత్తగా ఉడుకుతుంది. తర్వాత కుక్కర్లోని మటన్ ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై కళాయి పెట్టి, నూనె వేయాలి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను బాగా వేయించాలి.
అందులో కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టును, కరివేపాకును వేసి వేయించాలి. అవి వేగాక ధనియాల పొడి, ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసి వేయించాలి. ఐదు నిమిషాల తర్వాత తరిగిన టమోటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. టమోటో మెత్తగా నీళ్లలా మారి, మళ్ళీ చిక్కగా ఇగురులా మారుతుంది. ఆ సమయంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్‌ను వేయాలి. బాగా కలిపి మూత పెట్టాలి. చిన్న మంటపై స్టవ్ పెట్టాలి. అలా 20 నిమిషాలు వేయిస్తే చాలు మటన్ రోస్ట్ రెడీ.