Miriyala Pulusu : మిరియాల పులుసు ఎలా చేయాలి? ఆరోగ్యానికి కూడా మంచిది..
ఈ కాలంలో ఘాటైన మిరియాలు పులుసును చేసుకొని తింటే ఆరోగ్యపరంగా కూడా మంచిది.
- By News Desk Published Date - 11:00 PM, Tue - 26 September 23

మనం మిరియాలు(Black Pepper) ఎప్పుడూ వంటల్లో వాడుతుంటే మనకు దగ్గు, జలుబు వంటివి దరిచేరవు. జలుబు తగ్గడానికి మిరియాలు మంచి ఔషధం. జలుబు వచ్చినప్పుడు మిరియాల పాలు తాగమంటారు. అలాగే జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు మిరియాలతో రసం చేసుకొని తాగితే చాలా మంచిది. ఈ కాలంలో ఘాటైన మిరియాలు పులుసును చేసుకొని తింటే ఆరోగ్యపరంగా కూడా మంచిది.
మిరియాల పులుసు(Miriyala Pulusu)కు కావలసిన పదార్థాలు..
* మిరియాలు రెండు స్పూన్లు
* ఎండుమిర్చి ఐదు
* ధనియాలు రెండు స్పూన్లు
* మెంతులు పావు స్పూన్
* పెసరపప్పు ఒక స్పూన్
* జీలకర్ర ఒక స్పూన్
* పచ్చి కొబ్బరి పావు కప్పు
* కరివేపాకు ఒక రెబ్బ
* నూనె కొద్దిగా
* ఆవాలు ఒక స్పూన్
* కరివేపాకు ఒక రెబ్బ
* ఉల్లిపాయలు చిన్నవి నాలుగు
* ఇంగువ కొద్దిగా
* వెల్లుల్లి పాయలు పది
* ఉప్పు సరిపడ
* పసుపు పావు స్పూన్
* టమాటాలు రెండు
* నీళ్లు 300 ml
* చింతపండు పులుసు తగినంత
మిరియాల పులుసు తయారీ విధానం..
మిరియాలు, ఎండుమిర్చి, మెంతులు, ధనియాలు, పెసరపప్పు, జీలకర్ర, కరివేపాకు వంటి వాటిని దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తరువాత పచ్చి కొబ్బరి వేసుకొని అది వాసన పోయేంతవరకు వేయించుకోవాలి. అవి వేగిన తరువాత వాటిని చల్లార్చి అన్ని కలిపి మిక్సి జార్ లో వేసుకొని వాటిని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి.
అనంతరం స్టవ్ మీద మూకుడు పెట్టుకొని దానిలో నూనె వేసుకొని ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసుకొని తాలింపు వేగనివ్వాలి. ఇందులోనే వెల్లుల్లి దంచి వేయాలి. ఆ తరువాత ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు వేసి ఉల్లిపాయలు వేగే వరకు కలపాలి. ఉల్లిపాయలు మగ్గిన తరువాత టమాటాలు వేసి మగ్గనివ్వాలి. మగ్గిన టమాటాలలో చింతపండు పులుసు, నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. అనంతరం మిక్సి పట్టుకున్న మిరియాల మిశ్రమం పొడి పులుసులో వేసి బాగా మరగనివ్వాలి. అంతే మిరియాల పులుసు రెడీ అయినట్లే. వేడివేడి అన్నంలో మిరియాల పులుసు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.
Also Read : Black Raisins: నల్ల ఎండుద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు