Steam Facial Benefits: ముఖానికి 5 నిమిషాలకు మించి ఆవిరి పడితే ఏమవుతుందో తెలుసా?
మామూలుగా స్త్రీ, పురుషులు చాలా మంది చర్మ సౌందర్యం విషయంలో అనేక రకాల జాగ్రత్తలను పాటిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ముఖం అందంగా కనిపించాలని
- By Anshu Published Date - 09:29 PM, Wed - 2 August 23

మామూలుగా స్త్రీ, పురుషులు చాలా మంది చర్మ సౌందర్యం విషయంలో అనేక రకాల జాగ్రత్తలను పాటిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా ముఖం అందంగా కనిపించాలని గ్లోయింగ్ గా ఉండాలని అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ని హోమ్ రెమిడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఇంకొందరు ముఖానికి ఆవిరి కూడా పడుతూ ఉంటారు. అలా ఆవిరి పట్టడం వల్ల చర్మం తాజాగా మారుతుంది. ఆవిరి వల్ల చర్మ రంథ్రాలు తెరుచుకుని లోపలి నుంచి శుభ్రమవుతుంది. దీనివల్ల వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా మృదువుగా మారుతుంది.
అయితే ఒకవేళ మీ ఇంట్లో పేస్ స్టీమ్ మెషిన్ అందుబాటులో లేకపోతే ఒక వెడల్పు పాత్రలో నీరు పోసి బాగా మరిగించాలి. తరువాత ఒక టవల్ లేదా బెడ్‌షీట్‌తో తల, ముఖాన్ని కవర్ చేయాలి. అనంతరం పాత్రలోని ఆవిరిని ముఖానికి పట్టాలి. అయితే, ఫేషియల్ స్టీమింగ్ మీద చాలామందికి అవగాహన తక్కువ. ఫలితంగా ఎక్కువ సేపు ఆవిరిని పెట్టడం ద్వారా ఎక్కువ లాభం ఉంటుందని భావిస్తారు. కానీ అలా చేయడం చాలా తప్పు. ముఖానికి ఐదు నిమిషాలు కంటే ఎక్కువ సేపు ఆవిరి పట్టకూడదు. అయితే వాస్తవానికి ముఖానికి వేడి వేడి నీళ్లు తగలకూడదు. కేవలం వెచ్చని ఆవిరి మాత్రమే తగలాలి. అది కూడా కేవలం ఐదు నిమిషాల లోపే తగలాలి. లేకపోతే చర్మం తన సహజత్వాన్ని కోల్పోతుంది.
ముఖ్యంగా అందరి చర్మతత్వం ఒకేలా ఉండదు. జిడ్డు చర్మం, పొడిబారిన చర్మం, మొటిమలు, స్కిన్ అలర్జీలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. కాబట్టి స్కిన్ స్పెషలిస్ట్ సూచనల మేరకు ఇలాంటివి చేయాలి. ఆవిరి పట్టడం వల్ల అందరికీ ప్రయోజనాలు లభిస్తాయని చెప్పలేం. చర్మానికి ఐదు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఆవిరి పట్టినట్లయితే సహజసిద్ధంగా నూనెలను స్రవించే గ్రంధులకు నష్టం వాటిల్లుతుంది. ఫలితంగా చర్మంపై ముడతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆవిరి పట్టిన తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడగాలి. అలా చేస్తే స్వేదరంధ్రంలో ఉండే మలినాలు బయటకు పోతాయి. తడి చర్మాన్ని పొడిగా ఉండే మెత్తని టవల్‌తో శుభ్రం చేసుకోవాలి. చర్మం మరీ పొడిబారినట్లు కనిపిస్తే ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి.