Bendakaya Fry : చిటికెలో కరకరలాడే బెండకాయ వేపుడు.. ఇలా చేయండి
బెండకాయల్ని నీటిలో శుభ్రంగా కడుక్కుని, తడిలేకుండా మెత్తటి క్లాత్ లో వేసి తుడుచుకోవాలి. తడిలేకుండా తుడుచుకున్న బెండకాయల్ని చక్రాల్లాగా చిన్నగా కట్ చేసుకోవాలి.
- By News Desk Published Date - 09:13 PM, Wed - 18 October 23

Bendakaya Fry : బెండకాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఆ కూర చాలా మందికి నచ్చదు. ఎందుకంటే చేతికంతా జిగురు జిగురుగా అంటుకుంటుందని. బెండకాయ వేపుడైతే ఇష్టంగా తినేవారెందరో ఉన్నారు. కానీ.. వేపుడు చేయాలంటే ముక్కలు కోసి.. ఎండలో పెట్టి.. జాగ్రత్తగా వండుకోవాలి. ఇప్పుడు బెండకాయ వేపుడు చేసేందుకు అంత కష్టపడనక్కర్లేదు. చిటికెలో ఇలా రెడీ చేసేయొచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
బెండకాయ వేపుడుకి కావలసిన పదార్థాలు
బెండకాయలు – అరకిలో
నూనె – డీప్ ఫ్రై కి సరిపడా
ఉప్పు – రుచికి తగినంత
కారం – 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు – గుప్పెడు
పల్లీలు – గుప్పెడు
కరివేపాకు – కొద్దిగా
ఎండుకొబ్బరి పొడి – రెండు టీ స్పూన్లు
బెండకాయ వేపుడు తయారీ విధానం
బెండకాయల్ని నీటిలో శుభ్రంగా కడుక్కుని, తడిలేకుండా మెత్తటి క్లాత్ లో వేసి తుడుచుకోవాలి. తడిలేకుండా తుడుచుకున్న బెండకాయల్ని చక్రాల్లాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి స్టవ్ పై పెట్టుకోవాలి. అది వేడయ్యాక.. బెండకాయ ముక్కల్ని అందులో వేసి.. మాడిపోకుండా అటూ ఇటూ తిప్పుతూ.. ముక్కలవ్వకుండా వేయించుకోవాలి. 5 నిమిషాల్లో బెండకాయ ముక్కలు క్రిస్పీగా వేగిపోతాయనగా.. జీడిపప్పు, పల్లీలను కూడా అందులో వేసి వేయించుకోవాలి.
చివరిలో కొద్దిగా కరివేపాకు వేసి.. అది వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నూనెలో ఉన్న బెండకాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అందులో నూనె తీసేసి.. అదే కళాయిలో వేయించుకున్న బెండకాయ ముక్కలు, ఎండుకొబ్బరి పొడి, రుచికి తగినంత ఉప్పు, కారం వేసి అవి ముక్కలకు పట్టేలా వేయించుకోవాలి. అంతే కరకరలాడే బెండకాయ ఫ్రై రెడీ. వేడి వేడి అన్నంలో పప్పు, అందులోకి కాంబినేషన్ గా ఈ బెండకాయ ఫ్రై నంచుకుని తింటే.. ఆహా.. ఆ రుచేవేరు. ఇంకెందుకు లేటు మీరు కూడా ఇలా ఈజీగా బెండకాయ ఫ్రై ట్రై చేయండి.
Also Read : Mental Health Tips: పిల్లలలో మానసిక సమస్యలకు చెక్ పట్టండి ఇలా..!