ఆరోగ్యమైన చర్మానికి కలబందతో అద్బుతమైన ప్రయోజానాలు..ఎలా వాడాలంటే..?
సహజ ఆహారాల్లో కలబంద రసం ఒక ముఖ్యమైనది. చర్మాన్ని లోపలినుంచి పోషిస్తూ సహజమైన కాంతిని అందించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
- Author : Latha Suma
Date : 07-01-2026 - 4:45 IST
Published By : Hashtagu Telugu Desk
. చర్మానికి తేమ, రక్షణ అందించే కలబంద రసం
. ముడతలు, వృద్ధాప్య లక్షణాలకు చెక్
. మొటిమలు, దద్దుర్లకు సహజ పరిష్కారం
Aloe Vera For Skin : శరీర ఆరోగ్యాన్ని ఎంత ప్రాముఖ్యంగా చూస్తామో, అంతే ప్రాధాన్యం చర్మ ఆరోగ్యానికీ ఇవ్వాలి. మెరిసే, ఆరోగ్యకరమైన చర్మం ప్రతి ఒక్కరి కోరిక. ఇందుకోసం చాలా మంది ఖరీదైన బ్యూటీ క్రీములు, స్కిన్ కేర్ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ చర్మం పొడిబారడం, మొటిమలు, దద్దుర్లు, ముందే ముడతలు రావడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. కేవలం బాహ్య సంరక్షణ మాత్రమే కాకుండా, మనం తీసుకునే ఆహారం కూడా చర్మ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. అటువంటి సహజ ఆహారాల్లో కలబంద రసం ఒక ముఖ్యమైనది. చర్మాన్ని లోపలినుంచి పోషిస్తూ సహజమైన కాంతిని అందించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
కలబందలో దాదాపు 98 శాతం వరకు నీరు ఉంటుంది. అందుకే దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి, ముఖ్యంగా చర్మానికి సరిపడా తేమ అందుతుంది. రోజూ ఒక గ్లాస్ కలబంద రసం తాగడం వల్ల చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. చక్కెర కలిగిన పానీయాల స్థానంలో కలబంద రసాన్ని తీసుకుంటే చర్మంపై పగుళ్లు రావడం, ఎర్రదనం వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మం ఎప్పుడూ తాజాగా, ఉల్లాసంగా కనిపిస్తుంది. వేసవికాలంలో డీహైడ్రేషన్ వల్ల వచ్చే చర్మ సమస్యలను నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
వయస్సు పెరిగేకొద్దీ చర్మంపై గీతలు, ముడతలు రావడం సహజం. అయితే కలబంద రసాన్ని నిత్యం తీసుకోవడం ద్వారా ఈ లక్షణాలను కొంతవరకు నియంత్రించవచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను రక్షిస్తాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మానికి లవచత్వాన్ని అందిస్తాయి. ఫలితంగా చర్మం యవ్వనంగా, మెరిసేలా కనిపిస్తుంది. రోజువారీ ఆహారంలో కలబంద రసాన్ని భాగం చేసుకుంటే సహజమైన గ్లోను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కలబందలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మొటిమలు, దద్దుర్లు, చర్మంపై వచ్చే వాపును తగ్గించడంలో సహాయపడతాయి. లోపలినుంచి కలబంద రసం తీసుకోవడమే కాకుండా, బయటకు కలబంద జెల్‌ను ఫేస్ మాస్క్‌లా ఉపయోగిస్తే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది. చర్మం చల్లబడటంతో పాటు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అయితే కలబంద రసం తయారు చేసే సమయంలో తాజా, స్వచ్ఛమైన కలబందను మాత్రమే ఉపయోగించాలి. రసాయనాలు కలిపిన ఉత్పత్తులకంటే సహజంగా తయారుచేసిన రసమే చర్మానికి మేలు చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన జీవనశైలి, కలబంద రసం వంటి సహజ పదార్థాల వినియోగం ద్వారా ఖరీదైన చికిత్సలు లేకుండానే మెరిసే, ఆరోగ్యమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.