Vijay : హీరో విజయ్‌కి వై ప్లస్ కేటగిరీ భద్రత
ఇటీవల విజయ్ పార్టీ నేతలు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో మంతనాలు జరిపారు. అది తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీవీకేకు పీకే ప్రత్యేక సలహాదారుగా ఉండనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
- By Latha Suma Published Date - 01:33 PM, Fri - 14 February 25

Vijay: తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ హీరో విజయ్‌కి వై+ కేటగిరీ భద్రత కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని నిఘా వర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం భద్రత స్థాయిని నిర్ణయిస్తుంది. వై ప్లస్ భద్రత నాలుగో అత్యున్నత స్థాయి భద్రత. మొత్తం 11 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా భద్రత కల్పిస్తారు. వారిలో ఇద్దరి నుంచి నలుగురు కమాండోలు, మిగిలినవారు పోలీసు సిబ్బంది ఉంటారు.
ఇటీవల విజయ్ పార్టీ నేతలు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో మంతనాలు జరిపారు. అది తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో టీవీకేకు పీకే ప్రత్యేక సలహాదారుగా ఉండనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉంది. 2026లో జరిగే ఎన్నికల బరిలో దిగుతామని పార్టీని ప్రారంభించిన సమయంలోనే విజయ్ ప్రకటించారు. అలాగే ఆయన ప్రజా సంబంధ అంశాలపై తన అభిప్రాయాన్ని చురుగ్గా వెల్లడిస్తున్నారు.
Read Also: Tirumala Laddu : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. నిందితులకు వైద్యపరీక్షలు
కాగా, వై ప్లస్ కేటగిరీ భద్రత అంటే ఏమిటి? భారతదేశంలో ఎన్ని రకాల భద్రతా విభాగాలు ఉన్నాయి? ఎవరెవరికి ఈ భద్రత కల్పిస్తారు? భారతదేశంలో రాష్ట్రపతి, ప్రధానితో సహా గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రముఖులకు వివిధ రకాల భద్రత కల్పిస్తారు. సినిమా తారలు, ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఇందులో ఉన్నారు. వారి పదవి, ఎదురయ్యే ముప్పుని బట్టి భద్రత ఉంటుంది. రాష్ట్రపతికి 180 మంది సిబ్బందితో కూడిన భద్రతా బృందం ఉంటుంది. SPG అత్యంత కీలకమైన భద్రతా విభాగం.
ఇందిరా గాంధీ హత్య తర్వాత SPG ఏర్పాటైంది. ప్రధాని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా భద్రత కల్పిస్తుంది. ప్రస్తుతం ప్రధాని మోడీకి కూడా SPG భద్రతే ఉంది. ఈ విభాగంలో 3 వేల మంది సిబ్బంది ఉన్నారు. SPG తర్వాత Z+ భద్రత ఉంది. NSG, RPF, CRPF, CISF, ITBP ల నుంచి సిబ్బందిని ఎంపిక చేసి ఈ బృందాన్ని ఏర్పాటు చేస్తారు. మాజీ ప్రధానులు, మాజీ రాష్ట్రపతులు, తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న నాయకులకు ఈ భద్రత కల్పిస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కి Z+ భద్రత ఉంది. 5 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, 50 మంది సిబ్బందితో కూడిన ఈ భద్రతకు నెలకు 33 లక్షలు ఖర్చవుతుంది.
NSGకి చెందిన 6 మంది, పోలీసులతో కలిపి 22 మంది సిబ్బందితో Z భద్రత ఉంటుంది. తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న వారికి ఇంటెలిజెన్స్ సిఫార్సుతో ఈ భద్రత కల్పిస్తారు. 1 నుంచి 3 మంది వరకూ ఆయుధాలు ధరించిన సిబ్బంది వారితో పాటు ఉంటారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి Z భద్రత ఉంది. దీనికి నెలకు 16 లక్షలు ఖర్చవుతుంది. Y+ భద్రతలో NSGకి చెందిన నలుగురు, 6 మంది పోలీసులు ఉంటారు. సల్మాన్ ఖాన్, కంగనా రనౌత్, షారుఖ్ ఖాన్ లకు ఈ భద్రత ఉంది. దీనికి నెలకు 15 లక్షలు ఖర్చవుతుంది.
Read Also:JioHotstar : జియో హాట్‌స్టార్ సేవలు ప్రారంభం