8 Days – 108 Deaths : ఆ ఆస్పత్రిలో 8 రోజుల్లో 108 మరణాలు.. కారణమేంటి ?
8 Days - 108 Deaths : మహారాష్ట్రలోని నాందేడ్ లో ఉన్న డాక్టర్ శంకర్‌రావ్ చవాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల మరణాలు ఆగడం లేదు.
- By Pasha Published Date - 01:38 PM, Wed - 11 October 23

8 Days – 108 Deaths : మహారాష్ట్రలోని నాందేడ్ లో ఉన్న డాక్టర్ శంకర్‌రావ్ చవాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల మరణాలు ఆగడం లేదు. గత 8 రోజుల వ్యవధిలో ఈ ఆస్పత్రిలో 108 మంది చనిపోయారు. మొదటి రెండు రోజుల్లో (ఈనెల 2, 3 తేదీల్లో) 31 మంది రోగులు చనిపోయిన విషయం వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. మందుల కొరత, వైద్య సిబ్బంది కొరత వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే విషయం బయటికి వచ్చింది. అయినా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆస్పత్రిలో మరణాల పరంపర కొనసాగింది. తాజాగా గత 24 గంటల్లో మరో 11 మంది రోగులు చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వీరిని కలుపుకుంటే.. గత 8 రోజుల్లో ఆస్పత్రిలో వివిధ రకాల చికిత్సల కోసం చేరి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 108కి పెరిగింది.
We’re now on WhatsApp. Click to Join
అయినప్పటికీ ఆస్పత్రిలో మందుల కొరత లేదని ఆస్పత్రి డీన్ శ్యామ్ వాకోడ్ చెబుతుండటం గమనార్హం. ‘‘మందుల కొరత కారణంగా ఏ రోగి కూడా చనిపోలేదు. వారి పరిస్థితి క్షీణించడం వల్లే చనిపోయారు’’ అని ఆయన అంటున్నారు. ఒకవేళ మందుల కొరత ఉందని చెబితే.. ప్రభుత్వం నుంచి చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతోనే ఆయన ఇలా చెబుతున్నారనే వాదన వినిపిస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ స్పందిస్తూ.. నాందేడ్ ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 60 మందికిపైగా శిశువులు చేరారని, అయితే వారిని చూసుకోవడానికి ముగ్గురే నర్సులు ఉన్నారని చెప్పారు. దీన్ని బట్టి అక్కడ సిబ్బంది కొరత ఎంతగా ఉందో (8 Days – 108 Deaths) అర్థం చేసుకోవచ్చన్నారు.