Joint Parliamentary Committee : JPC(జాయింట్ పార్లమెంటరీ కమిటీ) అంటే ఏంటి?
JPC : పార్లమెంటులో కొన్ని ముఖ్యమైన అంశాలు, వివాదాస్పదమైన విషయాలపై సాంకేతికతతో కూడిన సమగ్ర విచారణ జరిపించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు
- By Sudheer Published Date - 03:39 PM, Tue - 17 December 24

జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary Committee-JPC) అనేది భారత పార్లమెంటులో ప్రత్యేకమైన కమిటీ. ఇది లోక్‌సభ మరియు రాజ్యసభ సభ్యులతో కలిసి ఏర్పడుతుంది. పార్లమెంటులో కొన్ని ముఖ్యమైన అంశాలు, వివాదాస్పదమైన విషయాలపై సాంకేతికతతో కూడిన సమగ్ర విచారణ జరిపించడానికి ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు. JPC సాధారణంగా ప్రభుత్వం లేదా ప్రతిపక్షాల సూచన మేరకు ఏర్పడుతుంది.
JPC ప్రధాన లక్ష్యం పారదర్శకతతో కూడిన దర్యాప్తు జరిపించడం. దేశ ప్రజలకు ప్రభావం చూపే ముఖ్యమైన స్కామ్‌లు, అక్రమాలు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ఈ కమిటీ విచారణ చేస్తుంది. కమిటీ చేసిన విచారణ, నివేదికను పార్లమెంటులో సమర్పిస్తారు. అయితే, JPC నివేదికకు చట్టపరమైన బలముండదు, కానీ రాజకీయంగా చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. JPCలో సభ్యుల ఎంపిక అనేది లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సభ్యులు సాధారణంగా అన్ని పార్టీల నుంచి ఎంపిక చేయబడతారు. కమిటీ వ్యవధి పూర్తయ్యేలోపు తన దర్యాప్తును పూర్తి చేసి, నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఇప్పటివరకు ఎన్నో ముఖ్యమైన కేసుల్లో ఏర్పాటు చేశారు. ఉదాహరణకు 2G స్పెక్ట్రమ్ స్కాం, బోఫోర్స్ కుంభకోణం వంటి వివాదాలపై JPCలు ఏర్పాటు అయ్యాయి. ఈ కమిటీ నివేదికలు రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. నేడు జమిలి బిల్లు (Jamili Bill) లోక్సభ ఆమోదం పొందగా, JPCకి పంపేందుకు సిద్ధమని అమిత్ షా ప్రకటించారు. JPC సభ్యుల పేర్లపై సాయంత్రానికి క్లారిటీ రానుంది.
Read Also : Hydra : హైడ్రా ఏర్పడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లం: రంగనాథ్