Delhi Water Crisis : ‘‘నీళ్లన్నీ ఏమవుతున్నాయి ?’’ : ఢిల్లీ సర్కారుకు ‘సుప్రీం’ ప్రశ్న
ఢిల్లీకి వస్తున్న నీళ్లన్నీ ఏమవుతున్నాయని దేశ రాజధానిలోని ఆప్ సర్కారును సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
- Author : Pasha
Date : 12-06-2024 - 12:59 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi Water Crisis : ఢిల్లీకి వస్తున్న నీళ్లన్నీ ఏమవుతున్నాయని దేశ రాజధానిలోని ఆప్ సర్కారును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీకి నదీ జలాలు వస్తున్నా కోర్టు ఎదుట ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని అడిగింది. హిమాచల్‌ప్రదేశ్ విడుదల చేసిన నదీ జలాలను ఢిల్లీకి విడుదల చేసేలా హర్యానాను ఆదేశించాలంటూ ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విచారించింది.
We’re now on WhatsApp. Click to Join
ఢిల్లీలో నీళ్లు వృథా అవుతున్నా.. ట్యాంకర్ మాఫియా రెచ్చిపోతున్నా ఏమీ చేయలేకపోతున్నారని ఆప్ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము న్యూస్ ఛానళ్లలో ఈ సమస్యకు సంబంధించిన వార్తలను రోజూ చూస్తున్నామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి వరాలేలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్యాంకర్ మాఫియాను ఆప్ సర్కారు అడ్డుకోలేకపోతే.. ఢిల్లీ పోలీసులను రంగంలోకి దింపుతామని తేల్చి చెప్పింది. అయితే ఢిల్లీ ప్రభుత్వం తరఫున న్యాయవాది షాదన్ ఫరాసత్ కోర్టు అభిప్రాయాన్ని తోసిపుచ్చారు. ఆప్ సర్కారు నీటి వృథాను ఆపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే ఆ చర్యల వివరాలేంటో తెలుపుతూ ఒక అఫిడవిట్‌ను రేపటిలోగా దాఖలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని(Delhi Water Crisis) దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.
Also Read :Robbin Sharma : రాబిన్ శర్మ.. ఏపీలో టీడీపీ విజయం వెనుక మాస్టర్‌మైండ్
రంగంలోకి అతిషి.. క్విక్ రెస్పాన్స్ బృందాలకు టాస్క్
సుప్రీంకోర్టు సీరియస్ అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతిషి రంగంలోకి దిగారు. దేశ రాజధాని ప్రాంతంలోని నీటి పైపులైన్ల వ్యవస్థను సమూలంగా తనిఖీ చేసేందుకు అదనపు జిల్లా మేజిస్ట్రేట్/సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ స్థాయి అధికారులు, తహసీల్దార్లతో క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను ఆమె ఏర్పాటు చేశారు. అవి తనిఖీలు నిర్వహించి ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల్లోగా తన కార్యాలయానికి నివేదికను సమర్పించాలని అతిషి ఆదేశించారు.ఢిల్లీలో నీటి ట్యాంకర్ల కేటాయింపు, నీటి పంపిణీకి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కార బాధ్యతలను క్విక్ రెస్పాన్స్ టీమ్‌లే చూడాలని సూచించారు.