Congress party : కాంగ్రెస్ తమ కన్నీళ్లను అర్థం చేసుకుంది: వినేశ్, బజరంగ్
Congress party : పార్టీలో చేరిక అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల అంశాన్ని వారు ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ తమ కన్నీళ్లను అర్థం చేసుకుందన్నారు.
- By Latha Suma Published Date - 06:35 PM, Fri - 6 September 24

Star of joined the Congress party : మాజీ రెజ్లర్లు బజరంగ్‌పూనియా, వినేశ్ ఫోగట్‌లు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరడానికి ముందు ఇరువురు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge)తో భేటీ అయ్యారు. పార్టీలో చేరిక అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో జరిగిన ఆందోళనల్లో వినేశ్, పునియా కీలకంగా వ్యవహరించారు. తాజాగా ఆ అంశాన్ని వారు ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ తమ కన్నీళ్లను అర్థం చేసుకుందన్నారు.
అది నాకు ఎంతో ఉద్వేగపూరితమైన అంశం..
మమ్మల్ని నిరసన సమయంలో రోడ్డు మీద ఈడ్చుకెళ్లినప్పుడు.. బీజేపీ మినహా అన్ని పార్టీలు అండగా నిలిచాయి. మా కన్నీళ్లను కాంగ్రెస్ అర్థం చేసుకుంది. నా పోరాటం ముగియలేదు. ప్రస్తుతం ఆ అంశం కోర్టుపరిధిలో ఉంది. కచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. ఇప్పుడు నాకు మరో వేదిక దొరికింది. దేశసేవలో శక్తివంచన లేకుండా ముందుకు సాగుతా. నేను వారితోనే ఉన్నానని నా సోదరీమణులకు చెప్పాలనుకుంటున్నాను. మీ కోసం ఎవరూలేనప్పుడు నేను, కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటాం” అని ఆమె ఫొగాట్ అన్నారు. అలాగే అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడటంతో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఒలింపిక్స్ కల చెదిరిన విషయం తెలిసిందే. దానికి వెనక ఏదైనా రాజకీయ కుట్రకోణం ఉందా..? అని అడిగిన ప్రశ్నకు ఆమె మాట్లాడుతూ.. అది నాకు ఎంతో ఉద్వేగపూరితమైన అంశం. దానిపై నేను సవివరంగా మాట్లాడతా. దానిపై నేను స్పందించేవరకు వేచి ఉండండి అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, దేశాభివృద్ధికి శక్తిమేర కృషి చేస్తాం..
రాజకీయాల కోసమే రాద్ధాంతం చేశామన్నారు. ఈ దేశ కుమార్తెల కోసం మా గళం వినిపించినందుకు మూల్యం చెల్లించుకుంటున్నాం. గతంలో బీజేపీ మహిళా ఎంపీలందరికీ లేఖలు రాశాం. మహిళల తరఫున గొంతు వినిపించాలని వేడుకున్నాం. కానీ, ఎవరూ ముందుకు రాలేదు.. పార్టీ గీసిన గీత దాటలేదు. బీజేపీ మినహా అన్ని పార్టీలు మాకు అండగా నిలిచాయి. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, దేశాభివృద్ధికి శక్తిమేర కృషి చేస్తాం. పారిస్ ఒలింపిక్స్‌లో ఫొగాట్ ఫైనల్‌కు చేరుకున్నప్పుడు దేశమంతా సంబరపడింది. కానీ, ఆ తర్వాత రోజు ఆమెను అనర్హురాలిగా ప్రకటించినప్పుడు అందరూ బాధతో కుంగిపోయారు. కానీ, ఒక ఐటీ సెల్ మాత్రం సంబరాలు చేసుకుంది” అని పునియా వ్యాఖ్యలు చేశారు.
అయితే.. వీరు హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా?లేదా? అని తెలియాల్సి ఉంది. దీనిపై పార్టీకి చెందిన ఎన్నికల ప్యానెల్ నిర్ణయం తీసుకుంటుంది..అని కాంగ్రెస్ తెలిపింది. వీరు కాంగ్రెస్‌లో చేరడంపై స్పందించిన బీజేపీ.. ఎవరైనా ఏ పార్టీలో అయినా చేరొచ్చు. కానీ ప్రజలు, మేధావులు ప్రశ్నలు అడుగుతారు.. అని విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించింది.