West Bengal : రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
గత ఏడాది ఫిబ్రవరిలో కూడా రాష్ట్ర విభజన ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని వాయిస్ ఓటింగ్ ద్వారా అసెంబ్లీలో ఆమోదించారు.
- Author : Latha Suma
Date : 05-08-2024 - 6:47 IST
Published By : Hashtagu Telugu Desk
West Bengal: పశ్చిమ బెంగాల్ విభజనను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ముఖ్యంగా ఉత్తర బెంగాల్‌తో కూడిన ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటు చేయాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సోమవారం రూల్ 185 కింద అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీఎం మమతా బెనర్జీ ఈ తీర్మానం గురించి అసెంబ్లీలో మాట్లాడారు. కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని తాము నమ్ముతామని, అయితే రాష్ట్రాన్ని విభజించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అంతేకాక.. బెంగాల్ విభజన డిమాండ్‌ను తెరపైకి తెచ్చిన ప్రతిపక్ష బీజేపీ కూడా విభజన వ్యతిరేక తీర్మానానికి మద్దతిచ్చింది. అయితే ఉత్తర ప్రాంతాల అభివృద్ధిని కోరుతున్నట్లు పేర్కొంది. తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన సువేందు అధికారి మాట్లాడారు. ‘ఐక్య పశ్చిమ బెంగాల్ సమగ్ర అభివృద్ధిని మేం కోరుకుంటున్నాం. రాష్ట్రాన్ని విభజించే ఏ ప్రయత్నానికైనా మేం వ్యతిరేకం’ అని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ సమగ్ర అభివృద్ధి గురించి తీర్మానంలో ప్రస్తావించాలని కోరారు.
కాగా, ఈ ప్రతిపాదనను తీర్మానంలో చేర్చేందుకు సీఎం మమతా బెనర్జీ అంగీకరించారు. చర్చల అనంతరం ఎలాంటి విభజన డిమాండ్ చేయకుండా బెంగాల్‌ను ఆదుకుంటాం.. బెంగాల్ అభివృద్ధికి కృషి చేస్తాం అన్న ప్రత్యామ్నాయ తీర్మానాలను సభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు.